సీబీఐ ఆఫీసర్లపై మర్డర్ కేసు

సీబీఐ ఆఫీసర్లపై మర్డర్ కేసు

కోల్ కతా: సీబీఐ కస్టడీలో ఉన్న నిందితుడు చనిపోయిన ఘటనలో ఆ ఏజెన్సీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురు సీబీఐ ఆఫీసర్లపై మర్డర్ కేసు పెట్టినట్టు బెంగాల్ సీఐడీ పోలీసులు బుధవారం తెలిపారు. వీరిలో డీఐజీ, ఎస్పీ సహా ఇతర ఆఫీసర్లు ఉన్నారని చెప్పారు. చనిపోయిన నిందితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు. కాగా, ఈ కేసుతో సంబంధం లేని సీనియర్ ఆఫీసర్ల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారని.. దీనిపై లీగల్ గా చాలెంజ్ చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. 

అసలేం జరిగిందంటే? 

టీఎంసీ లీడర్ భాదూ షేక్ మర్డర్ తర్వాత ఈ ఏడాది మార్చి 21న బీర్భూం జిల్లాలోని బోగతుయీలో అల్లర్లు జరిగాయి. ఇందులో 10 మంది చనిపోయారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన లలన్ షేక్​ను ఇటీవల అరెస్టు చేసింది. రాంపూర్ హట్ లోని తమ క్యాంప్ ఆఫీసులో అతణ్ని విచారిస్తోంది. అయితే సోమవారం అక్కడి బాత్ రూమ్ లో లలన్ షేక్ ఉరేసుకొని కనిపించాడు. సీబీఐ కస్టడీలోని నిందితుడు చనిపోవడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. లలన్ షేక్ ఆత్మహత్య చేసుకున్నాడని సీబీఐ చెబుతుండగా.. సీబీఐ అధికారులే చంపేశారని లలన్ షేక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత లలన్ డెడ్ బాడీని బంధువులకు అప్పగించగా.. వాళ్లు డెడ్ బాడీతో బీర్భూంలోని సీబీఐ ఆఫీసు ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. లలన్ షేక్ మృతికి సీబీఐ అధికారులే కారణమని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని చెప్పారు. కాగా, సీబీఐ ఆఫీసర్లు సోమవారం ఫోన్ చేసి తన భర్త చనిపోయినట్లు చెప్పారని లలన్ భార్య రేష్మా బీబీ తెలిపారు. ‘‘నేను అక్కడికి వెళ్లగా లోపలికి రానివ్వలేదు. నన్ను, నా కొడుకును కూడా చంపుతామని బెదిరించారు’’ అని ఆమె ఆరోపించారు.