- సెంటర్ నిర్వాహకుడి దంపతులు, మరో ఏడుగురిపై కేసు
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో వడ్ల స్కామ్ లో డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకుడి దంపతులతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. జైపూర్ మండలం కృష్టాపూర్ కు చెందిన లంబు శివ ప్రసాద్ గతేడాది నవంబర్ 11న డీసీఎంఎస్ సెంటర్ లో వడ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. గత రబీ సీజన్ లో 5600 క్వింటాళ్ల సన్న వడ్లు, 8700 క్వింటాళ్ల దొడ్డు వడ్లకు సెంటర్ నుంచి రూ.3.67 కోట్ల విలువైన ట్యాగింగ్ ఇచ్చి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో రైస్ మిల్లులకు పంపించి రూ.85 లక్షలు కాజేశారంటూ 24 మందిపై కంప్లయింట్ చేశాడు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు ఎంక్వైరీ చేయగా సెంటర్ లో రూ.38 లక్షల వడ్ల స్కామ్ జరిగినట్లు తేలింది. జిల్లా సివిల్ సప్లై డీఎం డీఎం శ్రీకళ ఫిర్యాదుతో జైపూర్ ఎస్ఐ శ్రీధర్ కేసు నమోదు చేశారు. డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకుడు మాదాసు రమేశ్, లావణ్య దంపతులతో పాటు బోగే మల్లయ్య, రొమ్మిపూర్ కు చెందిన కొండపర్తి ప్రభాకర్,కట్కూరి రమణారెడ్డి, అవునూరి రాకేశ్, మద్దులపల్లికి చెందిన కొండ వెంకటేశ్ పై కేసు నమోదైంది. ఏడుగురు నిందితులు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.
