సైరస్ మిస్త్రీ మృతి ఘటన: డ్రైవర్ పై కేసు

సైరస్ మిస్త్రీ మృతి ఘటన:  డ్రైవర్ పై కేసు

ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్,  డాక్టర్ అనహిత పండోల్ అనే మహిళ కారును డ్రైవ్ చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కారు ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత శనివారం పండోల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మోటారు వాహనాల చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

2022 సెప్టెంబర్ 4న సైరస్ మిస్త్రీ (54), ఆయన స్నేహితుడు మెర్సిడిస్ కారులో ప్రయాణిస్తున్నారు. ముంబై - అహ్మదాబాద్ హైవేపైనున్న సూర్య నది వంతెనపై కారు ప్రమాదానికి గురై మిస్త్రీ మరణించారు. కారు నడుపుతున్న అనహిత పండోలే.. ఆమె భర్త డారియస్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరు గత వారం ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విచారణలో పలువురి నుంచి సాక్ష్యాలు సేకరించినట్లు, ప్రాంతీయ రవాణా కార్యాలయంతో పాటు మెర్సిడెస్ ఇండియా నుంచి నివేదికలు పొందామని పోలీసులు వెల్లడించారు.

పండోల్ భర్త డేరియస్ వాంగ్మూలాన్ని ఇటీవల పోలీసులు నమోదు చేసుకున్నారు. ఒక లేన్ నుంచి మరో లేన్‌కు మారే క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు డేరియస్ చెప్పినట్లు తెలుస్తోంది. రిపోర్టులు, దర్యాప్తు ఆధారంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. డాక్టర్ అనహిత పండోల్‌పై కేసు నమోదు చేశామని వెల్లడించారు.