
- అడ్డగోలుగా పెంచే అధికారం ట్రంప్‌కు లేదని ఫిర్యాదు
వాషింగ్టన్: హెచ్ 1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రొక్లమేషన్ ను సవాలు చేస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో దావా (లాసూట్) వేశారు. పలు యూనియన్లు, కంపెనీల యాజమాన్యాలు, మతపరమైన సంఘాల కూటమి ఈ కేసు వేసింది.
హెచ్ 1బీ వీసా ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ దాఖలైన మొదటి కేసు ఇదే. ప్రెసిడెంట్ ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని హెచ్ 1బీ ప్రోగ్రాంను మార్చారని, అడ్డగోలుగా ఫీజు పెంచే అధికారం ఆయనకు లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అమెరికాకు ఆదాయం చేకూర్చేందుకే అలా నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదని పిటిషన్లో ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఫండ్స్ ను ఎలా ఖర్చు చేయాలో ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేరన్నారు. ట్రంప్ ఆర్డర్ ను అమలు చేయడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి చెందిన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్, విదేశాంగ శాఖ కొత్త విధాలను రూపొందించాయని పిటిషనర్లు ఆరోపించారు. దావా వేసిన వారిలో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ద జస్టిస్ యాక్షన్ సెంటర్, ద డెమోక్రసీ ఫార్వర్డ్ ఫౌండేషన్ తో పాటు పలు మతపరమైన సంస్థలు కూడా ఉన్నాయి.
ఫీ హైక్‌తో ఇండియన్ అప్లికేషన్ నిలిపివేత
నార్త్ కాలిఫోర్నియాలోని ఓ వర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా పనిచేస్తున్న ఇండియన్ రీసెర్చర్ ఫీనిక్స్ డో వీసా అప్లికేషన్.. హెచ్ 1బీ వీసా పెంపుతో నిలిచిపోయిందని పిటిషనర్లు తెలిపారు. ‘‘వయసు పెరగడం, డయాబెటిస్ వల్ల చూపు మందగించడానికి గల జెనెటిక్, ఎపిజెనెటిక్ కారణాలపై ఆమె పరిశోధన చేస్తున్నారు.
చూపు పోవడానికి గల కారణాలను డయాగ్నోస్ చేసేందుకు కొత్త పద్ధతులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె రీసెర్చ్‌పై వర్సిటీ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు హెచ్ 1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో వర్సిటీ ఆమె అప్లికేషన్‌ను హోల్డ్‌లో పెట్టింది” అని పిటిషనర్లు వివరించారు.