
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో పదహారు మంది భారత జవాన్లపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మే 28వ తేదీ మంగళవారం రాత్రి జమ్మూకశ్మీర్‌లో కుప్వారా పోలీస్ స్టేషన్‌పై కొంతమంది సైనికులు దాడి చేసి.. పోలీసులను చితక్కొట్టారు. పోలీసు స్టేషన్‌లోకి సైనికులు దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది.
మంగళవారం సాయంత్రం మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు.. బట్‌పోరా గ్రామంలోని ఓ టెరిటోరియల్ ఆర్మీ జవాన్ ఇంటిపై దాడులు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు అదే రోజు రాత్రి 9.40 గంటల సమయంలో.. పోలీసు స్టేషన్‌పైకి దూసుకెళ్లి దాడి చేశారు. స్టేషన్ లో ఉన్న పోలీసులను కొట్టారు. ఈ ఘటనలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీస్ ఉన్నతాధికారులు.. పోలీస్ స్టేషన్‌లో అల్లర్లు, హత్యాయత్నం, పోలీసులను కిడ్నాప్ చేయడం వంటి అభియోగాల కింద ఆర్మీ సైనికులపై ఎఫ్‌ఐఆర్ నమోద చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ అంకిత్ సూద్, రాజీవ్ చౌహాన్, నిఖిల్ నేతృత్వంలోని సాయుధ బృందం పోలీసు స్టేషన్ ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించిందని ఎఫ్‌ఐఆర్ లో తెలిపారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిపై దారుణంగా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఈ వివాదంపై స్పందించిన రక్షణ ప్రతినిధి మాట్లాడుతూ.. పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. పోలీసు సిబ్బందిని సైనికులు దాడి చేశారని జరిగిన ప్రచారాన్ని తప్పుబట్టారు. పోలీసు సిబ్బందికి, ప్రాంతీయ ఆర్మీ యూనిట్‌కు కార్యాచరణ విషయంలో నెలకొన్న చిన్నపాటి విభేదాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించడం జరిగిందని చెప్పారు.