పేటీఎంలో రూ. 10 కోట్ల  క్యాష్‌‌బాక్‌‌ స్కామ్

పేటీఎంలో రూ. 10 కోట్ల  క్యాష్‌‌బాక్‌‌ స్కామ్

ముంబై :  క్యాష్‌‌బాక్ రూపంలో  దాదాపు పది కోట్ల  రూపాయల మోసం గుర్తించడంతో చాలా మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు, చిన్న మర్చంట్లను కూడా డీలిస్ట్‌‌ చేసినట్లు పేటీఎం ప్రకటించింది. క్యాష్‌‌బాక్‌‌ మోడల్ కరెక్టైనదేనని ఈ సందర్భంగా సీఈఓ విజయ్‌‌ శేఖర్‌‌ శర్మ వెల్లడించారు. దివాలి తర్వాత చాలా మంది చిన్న వ్యాపారస్తులు భారీ క్యాష్‌‌బాక్స్‌‌ అందుకోవడాన్ని తమ టీం గమనించిందని, దాంతో లోతుగా పరిశీలించాల్సిందిగా ఆడిటర్లను కోరడంతో ఈ ఫ్రాడ్‌‌ బయటకు వచ్చిందని శర్మ తెలిపారు.

ఈ మోసాన్ని విచారించేందుకు కన్సల్టెన్సీ సంస్థ ఈవై సేవలను కూడా పేటీఎం ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. కిందిస్థాయిలోని కొంత మంది ఉద్యోగులతో కుమ్మక్కై కొంత మంది సెల్లర్లు అక్రమంగా క్యాష్‌‌బాక్‌‌లు పొందినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ మోసం  రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చని శర్మ తెలిపారు. మోసానికి పాల్పడిన ఉద్యోగులు, వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కొంత మంది ఉద్యోగులు వ్యాపారులతో కలిసిపోయి ఫేక్‌‌ ఆర్డర్లు సృష్టించడం ద్వారా క్యాష్‌‌బాక్‌‌లు పొందినట్లు తేల్చారు.

పేటీఎం–సిటీ క్రెడిట్ కార్డు
ముంబై : కో బ్రాండెడ్‌‌ క్రెడిట్‌‌ కార్డుల కోసం పేటీఎం, సిటీ గ్రూపులు చేతులు కలిపాయి. ఇండియాలో సిటీ గ్రూప్‌‌ 27 లక్షల క్రెడిట్‌‌ కార్డులు ఇష్యూ చేసింది. ఈ వాలెట్స్‌‌, ఈ కామర్స్‌‌ రంగాలలోని పేటీఎంకు 30 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఇందులో ఒక శాతం మంది కార్డులు తీసుకున్నా 30 లక్షల మంది అవుతారని, ఈ భాగస్వామ్యానికి మంచి భవిష్యత్‌‌ ఉంటుందని ఆశిస్తున్నామని సిటీ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ స్టీఫెన్‌‌ బర్డ్‌‌ మీడియాకు వెల్లడించారు. టార్గెట్లేమిటనేది వెల్లడించడానికి పేటీఎం సీఈఓ విజయ్‌‌ శేఖర్‌‌ శర్మ ఇష్టపడలేదు.

రెండు సంస్థలూ కలిసి రూపొందించిన ఒక టూల్‌‌ ద్వారా పేటీఎం కస్టమర్లలో క్రెడిట్‌‌ కార్డులకు అర్హులైన వారిని గుర్తిస్తామని తెలిపారు. దేశంలో 2.5 కోట్ల మంది క్రెడిట్‌‌ కార్డులు వాడుతున్నారని, బహుశా మరో అంతమంది కార్డులు కావాలని కోరుకుంటున్నారని శర్మ పేర్కొన్నారు. యూజర్ల నుంచి రూ. 500 వార్షిక ఫీ తీసుకుంటామని, ఇరు సంస్థలూ రెవెన్యూను ఒప్పందానికి అనుగుణంగా పంచుకుంటాయని చెప్పారు. నెలకు రూ. లక్ష కనీస రుణ పరిమితితో ఈ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ లావాదేవీకి ఒక శాతం క్యాష్‌‌బాక్‌‌ ఉంటుందని శర్మ వివరించారు. అమెరికా కంపెనీ వీసాను ప్రాసెసింగ్‌‌ పార్ట్‌‌నర్‌‌గా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు.