
Sensex Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిసిన తర్వాత ఇవాళ ఆగస్టు 12న పాజిటివ్ ప్రారంభాన్ని చూశాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలతో పాటు ఐటీ స్టాక్స్ లో కొనసాగిన కొనుగోళ్లు మార్కెట్లను ఆరంభంలో ముందుకు నడిపించాయి. అయితే మార్కెట్లలో మధ్యాహ్నం నాటికి ఊహించని విధంగా బుల్ ట్రెండ్ రివర్స్ అయ్యింది.
మధ్యాహ్నం నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్ఠాల నుంచి దాదాపు 500 పాయింట్లను కోల్పోయింది. దీంతో 12.09 గంటల సమయంలో సూచీ 118 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 19 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 247 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం దిగ్గజాలైన ఐసిఐసిఐ, హెచ్డీఎఫ్సీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని చూడటం సూచీలను నష్టాల్లోకి నెట్టింది. అయితే మార్కెట్లలో ట్రెండ్ రివర్స్ కావటానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. ముందుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మధ్య అలాస్కాలో ఆగస్టు 15న సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో చైనాకు మరో 90 రోజుల పాటు గడువు పెంపు ఒక సానుకూల అంశంగా ఉంది. అయితే రష్యా అమెరికా మధ్య చర్చల్లో పురోగతిపై క్లారిటీ కోసం మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రతినిధి పంకజ్ పాండే చెప్పారు.
2. ఇవాళ మార్కెట్లను ప్రభావితం చేసిన మరో అంశం విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం మార్కెట్ల నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకోవటం. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.వెయ్యి 202 కోట్ల విలువైన పెట్టుబడులను అమ్మేయటం దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తోంది.
3. అమెరికా ఆంక్షల తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ డిమాండ్ ఇతర దేశాలకు డైవర్ట్ కావటంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ ఆయిల్ రేటు 66.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ రేట్ల పెంపు పరోక్షంగా భారత దిగుమతుల ఖర్చులని పెంచి తిరిగి ద్రవ్యోల్బణాన్ని పెంచనుందని నిపుణులు అంచనా వేస్తుండటం మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.
4. మధ్యాహ్నం నాటికి ఆసియా మార్కెట్లతో పాటు దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ నష్టాల్లో కొనసాగటం భారత ఈక్విటీ ఇన్వెస్టర్లను కూడా ప్రభావితం చేసింది. సోమవారం నాడు అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగియటం నెగటివ్ సెంటిమెంట్లను బలపరిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక టెక్నికల్స్ పరిశీలిస్తే.. నిఫ్టీ సూచీ 25వేల మార్కును తరిగి అందుకోవటానికి కీలక అడ్డంకిగా 24670-, 24720, 24850 లెవెల్స్ కీలకమైన నిరోధాలుగా వ్యవహరిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు ఆనంద్ జేమ్స్ వెల్లడించారు. 24590 స్థాయిలో మార్కెట్లు నిలదొక్కుకోలేకపోతే సపోర్ట్ జోన్ గా 24450 పనిచేస్తుందని అంచనాలను పంచుకున్నారు. మెుత్తానికి మార్కెట్లు అమెరికా రష్యా మధ్య చర్చల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.