ట్రంప్ ను ఆపేసిన పిల్లి

ట్రంప్ ను ఆపేసిన పిల్లి

అమెరికా అధ్యక్షుడంటే ఎంత భద్రతుంటుందో తెలుసు కదా! ఆయన కాన్వాయ్​లో 50 నుంచి 60 వాహనాలుంటాయి. ఆయన ఉండేది బీస్ట్​. ఎంతటి ప్రమాదాన్నైనా తట్టుకుంటుంది కాబట్టే దానికి ఆ పేరు పెట్టారు. బుల్లెట్ల వర్షం కురిసినా, పెద్దపెద్ద బాంబులు పేలినా, అణు బాంబొచ్చి పడినా రసాయన ఆయుధాలు విషం చిమ్మినా దానికి ఏం కాదు. మూడు రోజుల క్రితం డొనాల్డ్​ ట్రంప్​ బ్రిటన్​ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు నిరసనలతోనే స్వాగతం ఎదురైంది. అయినా ఆయన్ను ఎవరూ అడ్డుకోలేకపోయారు. కానీ, ఒక్క పిల్లి, ఒకే ఒక్క పిల్లి అంతపెద్ద బీస్ట్​ను, అంత పెద్ద మనిషిని ఆపేసింది. డౌనింగ్​స్ట్రీట్​లో ‘లేరీ’ అనే పిల్లి బీస్ట్​ కిందకు దూరేసింది. కాసేపు కాన్వాయ్​ను ఆపేసింది. దీంతో దాని ప్రతిభ ట్విట్టర్​ గూటికి ఎక్కేసింది మరి. జనాలు దానిని అంత పొగిడారు మరి. పిల్లులు ‘బీస్ట్​’నూ అడ్డుకోగలవంటూ ట్వీట్లు చేశారు. ఇంకొందరైతే లేరీని బ్రిటన్​ పీఎం చేస్తే బాగుంటుందని కామెంట్లు చేశారు. ఇంతకన్నా మంచి నిరసనను తామెప్పుడూ చూడలేదంటూ మరో యూజర్​, అమెరికా కాంగ్రెస్​లోని సభ్యుల కన్నా లేరీకే ధైర్యం ఎక్కువని ఇంకొకరు, అదే నిజమైన యోధుడంటూ ఒకరు రీట్వీట్లు చేశారు. ఆ ట్వీట్​ బాగా వైరల్​ అయ్యే సరికి లేరీ మాత్రం ఊరుకుంటుందా? తన పేరిట ఓ ట్విట్టర్​ అకౌంట్​నే తెరిచేసింది (దాని పేరు మీద వేరే ఎవరో తెరిచారు లెండి). అసలెందుకు దాని కిందకు దూరాల్సి వచ్చిందో చెప్పింది. వర్షం పడుతుంటే అంతకు మించి ఏం చేయమంటారంది.