వాగులు దాటే క్రమంలో గల్లంతవుతున్న ప్రజలు

వాగులు దాటే క్రమంలో గల్లంతవుతున్న ప్రజలు
  • ఈ యేడు ఇప్పటికే తొమ్మిది మంది మృతి
  • ఇంకా దొరకని రైతు పర్వతాలు ఆచూకీ
  • బ్రిడ్జిలు నిర్మించాలని స్థానికుల డిమాండ్

 

నాగర్ కర్నూల్‌‌‌‌, వెలుగు:కాజ్‌‌‌‌వేలు, కల్వర్డులు.. ప్రజలు, పశువుల ప్రాణాలు తీస్తున్నాయి.  వీటి  పైనుంచి ఉప్పొంగి పారుతున్న వాగులను దాటే క్రమంలో జనాలు కొట్టుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ యేడు ఇప్పటి వరకు తొమ్మిది  మంది మృతి చెందారు. తాడూరు మండలం సిర్సవాడ గ్రామం దగ్గర దుందుభి వాగులో గురువారం కొట్టుకుపోయిన రైతు పర్వతాలు(55) ఆచూకీ ఇంకా దొరకలేదు.  ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు గాలించినా ఫలితం లేకుండా పోయింది.  ఏటా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుండడంతో వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు.  కొన్నిచోట్ల బ్రిడ్జిలు మంజూరైనా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.    

దుందుభిపై ఎక్కువ కాజ్‌‌‌‌వేలు
నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లాలోని తాడూరు, తెల్కపల్లి, కల్వకుర్తి, ఉప్పునుంతల, వంగూరు మండలాల మీదుగా ప్రవహించే దుందుభి నదిపై ఎక్కువ కాజ్‌‌‌‌వేలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కృష్ణా తర్వాత ఈ నదికే ఎక్కువ వరద వస్తుండడంతో కాజ్‌‌‌‌వేలు దాటే పరిస్థితి లేకుండా పోతోంది.  రోజువారీ కూలీలు, స్థానిక రైతులు ధైర్యం చేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నా అవతలి ఒడ్డుకు చేరే వరకు గ్యారంటీ ఉండడం లేదు. కొల్లాపూర్​ మండలంలో పెద్దవాగు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో వాగుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటోంది.  తాడూరు, బిజినేపల్లి, కల్వకుర్తి, ఉప్పునుంతల, వంగూరు, లింగాల మండలాల్లో వాగుల మీద కట్టిన కాజ్‌‌‌‌వేల నాచు పేరుకుపోయి బండ్లు స్కిడ్ అయి పల్టీలు కొడుతున్నాయి. 

పశుగ్రాసం కోసం వెళ్లి.. 
పశుగ్రాసం కోసం కోడేరు మండలం పస్పుల వాగు దాటుతుండగా రైతు బంగారయ్య భార్య కళ్ల ముందే కొట్టుకుపోయి మృతి చెందాడు.  తాడూరు మండలం నాగుదేవుల పల్లి వాగు దాటుతుండగా గ్రామానికి చెందిన పెంటయ్య గల్లంతు కాగా.. మరో వ్యక్తి  మహేందర్ ప్రాణాలతో బయట పడ్డాడు.  తెల్కపల్లి మండలం కార్వాంగ-తాళ్లపల్లి వాగులో రాఘవేందర్,  తాడూరు మండలం సిర్సవాడ వాగు దాటుతూ పర్వతాలు, అమ్రాబాద్‌‌‌‌లో వరద నీటికి పట్టు తప్పి కింద పడి మునీర్‌‌‌‌‌‌‌‌ చనిపోయాడు.  వెల్దండ మండలం బైరాపూర్ వాగులో పశువులు గల్లంతయ్యాయి.  

ముందు సాగని బ్రిడ్జిల నిర్మాణం
కొల్లాపూర్ మండలంలో నార్లాపూర్​, ముక్కిడిగుండ వద్ద పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 20 ఏండ్ల కింద శిలాఫలకం వేసి వదిలేశారు.  కోడేరు మండలం పస్పుల గ్రామస్తులు చందాలు వేసుకుని గ్రామంలోని వాగుకు అడ్డంగా పైపులు వేసి టెంపరరీ రాకపోకలకు వీలుగా మట్టి  పోసుకున్నారు.  ఇటీవల వచ్చిన భారీ వరదకు అది కొట్టుకుపోయింది.  తెల్కపల్లి మండలం కార్వంగ-తాళ్లపల్లి  గ్రామాల మధ్య డిండి వాగుపై బ్రిడ్జి నిర్మాణం పిల్లర్ల వరకు వచ్చి ఆగిపోయింది.  

నలుగురిని మింగిన సరళాసాగర్ రోడ్డు బ్రిడ్జి
వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా మదనాపురం మండలం రైల్వేస్టేషన్ సమీపంలోని రోడ్డు బ్రిడ్జిపై నుంచి పారుతున్న సరళాసాగర్‌‌‌‌‌‌‌‌ వాగు నలుగురిని మింగింది.  సెప్టెంబర్ 6న ఆత్మకూర్ కు చెందిన  ప్రైవేట్ లెక్చరర్ కురుమూర్తి  రోడ్డు దాటుతుండగా బైక్ తో సహా కొట్టుకుపోయాడు.  వారం కింద కొత్తకోటకు చెందిన సాయికుమార్, అతని చిన్నమ్మ చెన్నమ్మ  ఆమె కూతురు పరిమళ బైక్‌‌‌‌పై రోడ్డు దాటుతుండగా వాగులో కొట్టుకుపోయారు.  20 గంటల తర్వాత వీరి మృతదేహాలను దొరికాయి. ప్రభుత్వం ఇక్కడ  ఎనిమిదేళ్ల కింద బ్రిడ్జి మంజూరు చేసినా.. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులు మొదలు పెట్టలేదు.