పీఎన్బీ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

పీఎన్బీ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు అధికారులు. కేసులో ప్రధాన సూత్రధారి సుభాష్ శంకర్ ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. ఈజిప్టులోని కైరోలో సుభాష్ శంకర్ ను అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చారు సీబీఐ అధికారులు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సుభాష్ శంకర్ అత్యంత సన్నిహితుడు. సుభాష్ శంకర్ ను భారత్ కు రప్పించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది సీబీఐ. 

నీరవ్ మోడీపై పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 13 వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన ఆరోపణలున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అభ్యర్థన మేరకు.... నీరవ్ మోడీ.. అతడి సోదరుడు నిషాల్ మోడీ.. ఉద్యోగి సుభాష్ శంకర్ లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది ఇంటర్ పోల్. ఇక 2018లో కేసు మొదలైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. కైరోలో తలదాచుకున్నాడు. తమకు అందిన ఇన్ పుట్ ల ద్వారా సీబీఐ ఆపరేషన్ చేపట్టి... సుభాష్ శంకర్ ను పట్టుకుంది. ప్రత్యేక విమానంలో.. సుభాష్ శంకర్ ను ముంబైకి తీసుకొచ్చారు అధికారులు. మద్యాహ్నం ముంబైలోని సీబీఐ కోర్టులో సుభాష్ శంకర్ ను హాజరు పరచనున్నట్లు తెలిపారు అధికారులు. విచారణ నిమిత్తం అతడి కస్టడీ కోరనున్నారు. 

పీఎన్ బీ స్కాం కేసులో నీరవ్ మోడీపై రెండు సెట్ల క్రిమినల్ ప్రోసీడింగ్ లు ఉన్నాయి. రుణ ఒప్పందాలను మోసపూరితంగా పొంది.. పీఎన్ బీ బ్యాంకు పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిందని సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమ లావాదేవీలపై ఈడీ మరో కేసును నమోదు చేసింది. కేసుకు సంబంధించి సాక్ష్యులను బెదిరించడం... సాక్ష్యాలు మాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నీరవ్ మోడీ.