లిక్కర్ స్కాం: బినోయ్, శరత్ చంద్రకు వారం రోజుల కస్టడీ 

లిక్కర్ స్కాం: బినోయ్, శరత్ చంద్రకు వారం రోజుల కస్టడీ 

ఢిల్లీ : లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇరుపక్షాల వాదనలు విన్న స్పెషల్ సీబీఐ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఇరువురి నిందితులను వారి భార్యలు కలిసేందుకు కోర్టు అనుమతించింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కుటుంబ సభ్యులు వారిని కలవవచ్చని స్పష్టం చేసింది. 

ఇండో స్పిరిట్తో సంబంధం లేదు

అరెస్టుకు సంబంధించి తొలుత వాదనలు వినిపించిన బినోయ్ బాబు తరఫు న్యాయవాది లిక్కర్ స్కాంలో లబ్ది పొందిన ఇండో స్పిరిట్స్ కంపెనీతో తన క్లయింటుకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. బినోయ్కు చెందిన పర్నర్డ్ రిచ్చర్డ్స్ కంపెనీకి ఇండో స్పిరిట్ కు మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఆయనను ఎలా అరెస్ట్ చేశారని వాదించారు. బినోయ్ను సీబీఐ సాక్షిగా పరిగణించి వాంగ్మూలం నమోదు చేసుకుందని, అలాంటి వ్యక్తిని ఈడీ నిందితుడిగా పేర్కొని ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్తో నిందితుడికి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయగలరా అని ఈడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే సమయంలో కేసు నమోదు చేసినప్పుడు నిందితుల పేరు జాబితాలో లేనంత మాత్రాన ఆ వ్యక్తికి నేరంతో సంబంధంలేదని చెప్పలేమని స్పష్టం చేసింది. మరోవైపు కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉన్నందున సీబీఐ ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈడీ అధికారులు ఉద్యోగుల్ని వేధిస్తున్నరు

కేసుకు సంబంధించి వాదనలు వినిపించిన శరత్ చంద్రా రెడ్డి తరఫు లాయర్.. లిక్కర్ స్కాంలో ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కంపెనీల పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తోందని అన్నారు. వాటిపై శరత్ రెడ్డి కంట్రోల్ ఉన్న విషయాన్ని సదరు కంపెనీ ఉద్యోగులు చెప్పారని ఈడీ పేర్కొన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. శరత్ వద్ద పనిచేసే ఉద్యోగి విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత అతని వినికిడి శక్తి దెబ్బతిందని, దీన్ని బట్టి స్టేట్మెంట్స్ ఎలా రికార్డు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసు విషయంలో ఈడీ ప్రొసీజర్ ఫాలో కావడం లేదన్న లాయర్.. శరత్ రెడ్డి కంపెనీ ఉద్యోగులను ఈడీ అధికారులు వేధిస్తున్నందున చాలా మంది ఉద్యోగాలు వదలి వెళ్తున్నారని కోర్టుకు చెప్పారు.

శరత్ రెడ్డికి రూ.60కోట్ల లబ్ది

శరత్ రెడ్డి న్యాయవాది వాదనలపై స్పందించిన ఈడీ.. ఇండో స్పిరిట్స్లో శరత్ చంద్రా రెడ్డి పెట్టుబడి పెట్టిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. శరత్ రెడ్డి కంట్రోల్ లో ఉన్న 5 రిటైల్ జోన్స్లోనే 30శాతం విలువైన లిక్కర్ స్కాం జరిగిందని, ముడుపులు సైతం వందల కోట్లలో అందాయని చెప్పారు. ఇండో స్పిరిట్స్ కోసం ఎక్సెస్ క్రెడిట్ నోట్స్ ఇచ్చినందున రిటైల్ బిజినెస్లో శరత్ రెడ్డికి లబ్ది జరిగేలా ప్లాన్ చేశారని ఫలితంగా ఆయన రూ.60కోట్లకు మించి లబ్ది పొందినట్లు ఈడీ వాదించింది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ క్లియర్ గా కనిపిస్తున్నందునే ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నామని కోర్టుకు విన్నవించారు. శరత్ రెడ్డి కంపెనీ ఉద్యోగిని గాయపరిచారంటూ ఆయన తరఫు లాయర్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజంలేదని చెప్పారు. శరత్ రెడ్డి అరెస్ట్ అనంతరం ఈ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక ఆంతర్యం ఏంటని ఈడీ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం నిందితుల కస్టడీకి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.