జగదల్పూర్ స్టీల్ ప్లాంట్ పనుల్లో అవినీతి .. మేఘాపై సీబీఐ కేసు

జగదల్పూర్ స్టీల్ ప్లాంట్ పనుల్లో అవినీతి  ..  మేఘాపై సీబీఐ కేసు

    

  •     రూ. 174 కోట్ల బిల్లుల కోసం రూ. 78 లక్షల లంచం ఇచ్చినట్టు ఆరోపణలు 
  •     ఎన్ఎండీసీ, ఎన్ఐఎస్​పీ, స్టీల్ మినిస్ట్రీ అధికారులపైనా కేసు 

ఒడిశా-చత్తీస్​గఢ్ బార్డర్​లో చేపట్టిన రూ. 315 కోట్ల జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్  స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో మేఘా కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది.  రూ. 174 కోట్ల బిల్లుల చెల్లింపునకు అధికారులకు రూ. 78 లక్షల లంచం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది.

న్యూఢిల్లీ:  ఒడిశా–చత్తీస్ గఢ్ బార్డర్ లో చేపట్టిన రూ. 315 కోట్ల జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్  స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రాజెక్టులోని ఇన్ టేక్ వెల్, పంపుహౌస్ నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన మేఘా కంపెనీ.. రూ. 174 కోట్ల బిల్లుల చెల్లింపునకు గాను అధికారులకు రూ. 78 లక్షల లంచం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. 

ఈ వ్యవహారంలో లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడిన ఎన్ఎండీసీ, ఎన్ఐఎస్ పీ, మెకాన్ లిమిటెడ్, స్టీల్ మినిస్ట్రీకి చెందిన 8 మంది అధికారులను కూడా నిందితులుగా చేర్చినట్టు సీబీఐ అధికారులు శనివారం వెల్లడించారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ అంశంపై 2023, ఆగస్టు 10వ తేదీననే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైందని, ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత మార్చి 31న రెగ్యులర్ కేసు నమోదైందని తెలిపారు. ఆ తర్వాత గురువారం దీనిపై సీబీఐ కేసు ఫైల్ అయిందని పేర్కొన్నారు.   

ఎలక్టోరల్ బాండ్లలోనూ ‘మేఘా’ సంచలనం.. 

ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాల్లోనూ మేఘా కంపెనీ సంచలనం సృష్టించింది. రూ. 966 కోట్ల బాండ్లు కొని, వివిధ పార్టీలకు డొనేట్ చేసిన ఆ కంపెనీ దేశంలోనే అత్యధిక మొత్తంలో బాండ్లు కొన్న రెండో కంపెనీగా నిలిచింది. మేఘా కంపెనీ కొన్న ఎలక్టోరల్ బాండ్లలో బీజేపీకి రూ. 586 కోట్లు, బీఆర్ఎస్ కు రూ. 195 కోట్లు, డీఎంకేకు రూ. 85 కోట్లు, వైసీపీకి రూ. 37 కోట్లు, టీడీపీకి రూ. 25 కోట్లు, కాంగ్రెస్ కు రూ. 17 కోట్లు, జేడీఎస్, జేడీయూ, జనసేన వంటి పార్టీలకు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకూ అందినట్లు వెల్లడైంది.