రంగంలోకి దిగిపోయిన సీబీఐ.. మణిపూర్ ఘటనలపైనా లోతుగా విచారణ

రంగంలోకి దిగిపోయిన సీబీఐ..  మణిపూర్ ఘటనలపైనా లోతుగా విచారణ

మ‌ణిపూర్‌లో ఇద్దరు మ‌హిళ‌ల్ని న‌గ్నంగా ఊరేగించిన కేసులో సీబీఐ ద‌ర్యాప్తు మొద‌లుపెట్టింది. దీనిలో భాగంగా సీబీఐ శనివారం (జులై 29న) ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. కుకీ తెగ‌ల‌కు చెందిన మ‌హిళ‌ల్ని న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఆ వైర‌ల్ వీడియో కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టనున్నట్లు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 

మ‌ణిపూర్ ప్రభుత్వంతో చ‌ర్చలు నిర్వహించిన త‌ర్వాతే ఆ కేసును సీబీఐకి అప్పగించిన‌ట్లు కేంద్ర హోంశాఖ కార్యద‌ర్శి అజ‌య్ భ‌ల్లా తెలిపారు. వీడియో ఘటన కేసులో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది సీబీఐ. గత మూడు నెలలపాటు మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన పలు కేసులను రాష్ట్రం వెలుపల కూడా విచారణ జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాంగ్‌పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఇద్దరు మ‌హిళ‌ల్ని న్యూడ్‌గా ఊరేగించిన ఘ‌ట‌న ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో ప్రస్తుతం జ‌రుగుతున్న పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లోనూ మ‌ణిపూర్ అంశం దుమారం రేపుతోంది.

శనివారం (జులై 29న) 20 మంది విప‌క్ష నేత‌లు మణిపూర్ రాష్ట్రంలో ప‌ర్యటిస్తున్నారు. ప్రతిపక్షాల కూటమి ఇండియాకు చెందిన ఎంపీలు పర్యటిస్తున్నారు. అక్కడి క్షేత్రస్థాయి స్థితిగతులను పరిశీలించనున్నారు. కొద్దికాలంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న మైతేయ్‌, కుకీ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడనున్నారు. శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు కాంగ్రెస్ నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ తెలిపారు.