కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు.. డిసెంబరు 6న విచారణకు రావాలని పిలుపు

కల్వకుంట్ల కవితకు సీబీఐ  నోటీసులు.. డిసెంబరు 6న విచారణకు రావాలని పిలుపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 crpc కింద నోటీసులు పంపింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ ఈ నోటీసు ఇచ్చింది.  ఈనెల 6వ తారీఖున ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో సీబీఐ తెలిపింది. హైదరాబాదు లేదా ఢిల్లీలో ఎక్కడైనా సీబీఐ ముందు హాజరు కావాలని పేర్కొంది. రెండు రోజుల క్రితమే (నవంబరు 30న రాత్రి) ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  చేర్చింది. ఈ పరిణామం చోటుచేసుకున్న రెండు రోజుల్లోనే సీబీఐ నుంచి కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇష్యూ కావడం గమనార్హం. 

నా నివాసంలో కలుసుకోవచ్చని సీబీఐ అధికారులకు చెప్పాను  : కవిత

‘‘ ఢిల్లీ  లిక్కర్ స్కామ్ లో వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 ప్రకారం CBI నాకు నోటీసులు జారీచేసింది. వారి అభ్యర్థన మేరకు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశాను’’ అని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. 

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ  కవిత పేరును ఈడీ  అధికారులు ప్రస్తావించారు. నవంబరు 30న ఉదయం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చారు. ఆమ్​ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు. విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని..ఆ 10 ఫోన్ల IMEI నెంబర్లను అమిత్ అరోరా 32 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు. అయితే 2021 సెప్టెంబరు 1వ తేదీన  ఒకేరోజు ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి అభిషేక్​ రావు, సీఏ బుచ్చిబాబు ఫోన్లు మార్చినట్లు పేర్కొన్నారు.

ఎవరీ అమిత్​ అరోరా ? 

గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు.ఇవాళ ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.   

9 నెలల్లో 10 ఫోన్లు మార్చిన ఎమ్మెల్సీ కవిత 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది.  అమిత్​ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు (9 నెలల్లో ) కవిత 10 ఫోన్లు మార్చారని ఈడీ తెలిపింది. ఆ 10 ఫోన్ల IMEI నెంబర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది. ఈ కేసులో ధ్వంసమైన మొత్తం 153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది. 

అమిత్ అరోరా ఫోన్ కాల్ డేటాలో కవిత నెంబర్

అమిత్ అరోరా ఫోన్ కాల్ డేటాలో కవిత ఫోన్ నెంబర్ ఉందని.. ఆయనతో ఎమ్మెల్సీ కవిత పలు సార్లు మాట్లాడారని రిమాండ్​ రిపోర్టులో పొందుపరిచారు. అమిత్ అరోరా తన ఫోన్ నుంచి కవితకు 10 సార్లు కాల్ చేసినట్లు ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం బయటికి వచ్చినప్పటి నుంచి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారని..అందులో భాగంగానే ఫోన్లు మార్చారని ఈడీ అధికారులు చెప్పారు.