Land for Job Scam : ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో రబ్రీదేవి నివాసంపై సీబీఐ దాడులు 

Land for Job Scam : ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో రబ్రీదేవి నివాసంపై సీబీఐ దాడులు 

బీహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ ముఖ్యమంత్రి సతీమణి రబ్రీదేవి నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది. IRCTC ల్యాండ్ ఉద్యోగాల కుంభకోణం కేసులో రబ్రీదేవిని పాట్నాలోని ఆమె నివాసంలో ప్రశ్నించింది 

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు రబ్రీ దేవిని ప్రశ్నిస్తున్నారు. 2004 నుంచి 2009 మధ్య రైల్వేశాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌లో కుంభకోణం జరిగింది. రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్ద నుంచి భూములు, ప్లాట్లు తీసుకున్నట్లుగా  లాలూ కుటుంబంపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపైనా కేసు నమోదు చేసింది. 

ఈ కేసులోనే పాట్నాలోని ఆమె ఇంట్లో రబ్రీదేవిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి పిలిపించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పాట్నాలోని లాలా ప్రసాద్ ఇంటి బయట భారీ భద్రతను మోహరించారు.

సీబీఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రబ్రీదేవి కుమారులు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఆమె నివాసానికి వెళ్లారు. 

ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఫిబ్రవరి 27న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నిందితులు మార్చి 15వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్‌ ఆదేశించారు.
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఒకరిని మినహాయిస్తే.. మిగతా నిందితులకు సంబంధించి అరెస్టు చేయకుండానే చార్జిషీటు దాఖలు చేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.

లాలూ ప్రసాద్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు స్పెషల్ డ్యూటీ (OSD) అధికారిగా పని చేసిన భోలా యాదవ్‌ను ఇదే కేసులో 2022 జూలైలో సీబీఐ అరెస్టు చేసింది. 16 మంది నిందితులపై నేరపూరిత కుట్ర, అవినీతి నేరాలకు సంబంధించి గతేడాది అక్టోబర్‌ 10న ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

తుది నివేదికలో ప్రసాద్ కుమార్తె మిసా భారతి, సెంట్రల్ రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సౌమ్య రాఘవన్, రైల్వే మాజీ CPO కమల్ దీప్ మైన్‌రాయ్, ప్రత్యామ్నాయంగా నియమించబడిన ఏడుగురు అభ్యర్థులు, నలుగురు ప్రైవేట్ వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. లాలూ ప్రసాద్‌తో పాటు ఇతరులపై జరిగిన ప్రాథమిక విచారణ ఫలితాల మేరకు కేసు నమోదు చేసినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది.