రూ. 50 లక్షలు తీసుకుని చైనీయులకు వీసాలు!

రూ. 50 లక్షలు తీసుకుని చైనీయులకు వీసాలు!

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం  కుమారుడు కార్తీ చిదంబరం ఇళ్లలో, దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబయి,చెన్నై సహా ఏడు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2010, 14 మధ్య కాలంలో విదేశీ రెమిటెన్స్‌ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై సీబీఐ తాజా కేసు నమోదు చేసింది. కార్తీ చిదంబరం తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.305 కోట్ల మేర విదేశీ నిధులను స్వీకరించినందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా పలు కేసుల్లో విచారణ జరుగుతోంది.

సీబీఐ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా భయపడేది లేదని కార్తీ చిదంబరం తెలిపారు. తనపై సీబీఐ ఎన్నిసార్లు దాడులు జరిపారో లెక్కే లేదని, ఇదొక రికార్డయి ఉంటుందని సెటైర్‌ వేశారు. యూపీఏ హయాంలో పంజాబ్ లోని పవర్ ప్రాజెక్ట్ కోసం 250 మంది చైనా పౌరులకు వీసా కల్పించేందుకు కార్తీ చిబందరం రూ. 50 లక్షలు లంచం తీసుకున్నారనే అభియోగాలతో  సీబీఐ కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదు చేసింది.

సీబీఐ సోదాలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. చెన్నై, ఢిల్లీలోని తన అధికార నివాసాలపై సీబీఐ బృందం సోదాలు చేసిందన్నారు. తనిఖీల్లో ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని.. వాళ్లకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. కానీ అధికారులు తనకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారని..అందులో తన పేరు లేదని పేర్కొన్నారు. తనిఖీలు చాలా ఆసక్తిగా జరిగాయంటూ చిదంబరం ట్వీట్ చేశారు.
 

మరిన్ని వార్తల కోసం

అదానీ.. ఇండియాలో నం.2 సిమెంట్​ కంపెనీ

లోన్ల కోసం ఫైనాన్స్‌‌ సంస్థలతో మాట్లాడండి