పత్తి కొనుగోళ్లకు సీసీఐ రెడీ

పత్తి కొనుగోళ్లకు సీసీఐ రెడీ

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రెడీ అవుతోంది.  వ్యాపారులు సిండికేట్ గా మారి రెండు నెలలుగా పత్తి ధర తగ్గిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  సీసీఐ ఆధ్వర్యంలో కమర్షియల్ పత్తి కొనుగోళ్లకు మంగళవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వేలం పాట జరగనుంది. ఇప్పటికే దీనిపై సీసీఐ అధికారులు మార్కెట్ శాఖకు లెటర్​పంపారు. అటు సీసీఐ కమర్షియల్ కొనుగోళ్లు జరపాలని ఎప్పటి నుంచో రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో ముంబాయి సీసీఐ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో కమర్షియల్ కొనుగోళ్లు జరిపేందుకు జిల్లా సీసీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వేలంలో సీసీఐ  అధికారులతోపాటు ప్రైవేట్ వ్యాపారులు పాల్గొననున్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్​కు రూ.8100గా ఉంది. వేలం పాటలో దీని కంటే ఎక్కువగానే పలికే అవకాశం ఉంది. వేలం పాటలో పాడిన ధరను తగ్గించేందుకు అవకాశం ఉండదు. దీంతో ధర నిలకడ ఉండి రైతులు లాభపడతారని రైతు సంఘ నాయకులు అంటున్నారు. 

పాడిన వేలం కంటే తక్కువ చేసిన్రు..

జిల్లాలో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ముందుగా వేలం పాటలో ప్రైవేట్ వ్యాపారులు రూ.8,300 ధరతో కొనుగోళ్లు జరిపారు. మధ్యలో రూ.9 వేలకు పెంచినా అది మూడు రోజుల ముచ్చటే అయింది. దీంతో నెల రోజులుగా రూ.8,300 కంటే తక్కువకే కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రైతులు పత్తిని సగం కూడా మార్కెట్లోకి తీసుకురాలేదు. అటు ఇండ్లలో నిల్వ చేసుకోవడంతో పాటు పొలాల్లో పెద్దఎత్తున పత్తి ఉంది. ఈ ఏడాది అధిక వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. రెండు నెలల్లో ఇప్పటివరకు 1.75 లక్షల క్వింటాళ్లు మాత్రమే మార్కెట్ కు వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 5 లక్షల క్వింటాళ్లు కొనుగోళ్లు జరిగాయి. 21 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా వేసిన అధికారుల లెక్కలు తప్పుతున్నాయి. ఇటు దిగుబడి లేక.. అటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర పెరుగుతుందనే ఆశతో పత్తి నిల్వ చేసిన రైతులు.. అప్పులు, కూలీలకు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ధర అయినా కొందరు అమ్ముకుంటున్నారు. నిల్వలు, పంట పొలాల్లో ఉండటంతో ఫిబ్రవరి వరకు మార్కెట్ కు పత్తి వచ్చే అవకాశం ఉందని అధికారులు 
చెబుతున్నారు.  

ధర పెరిగితే రైతులకు లాభం

మార్కెట్ యార్డులో కమర్షియల్ గా ప్రైవేట్ వ్యాపారులతో సమానంగా పత్తి కొనుగోళ్లు జరిపేందుకు సీసీఐ ముందుకు వచ్చింది. రెండు పోటాపోటీగా వేలం జరిపితే రైతులకు లాభం జరుగుతుంది. లోకల్ రేటు  నిర్ణయించి వేలం పాట నిర్వహిస్తాం. దీని వల్ల ధర పెరగడమే కాకుండా.. తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు.
- శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ ఆదిలాబాద్  

పారదర్శకంగా జరపాలి

సీసీఐ కమర్షియల్ పత్తి కొనుగోళ్లు జరపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కలెక్టర్, సీసీఐ అధికారులకు విన్నవించాం. ఎట్టకేలకు సీసీఐ కొనుగోళ్లు చేసేందుకు రావడం సంతోషంగా ఉంది. రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా పారదర్శకంగా వేలం పాట, కొనుగోళ్లు జరిపితే మేలు జరుగుతుంది. ప్రైవేట్ వ్యాపారులకు సీసీఐ పోటీ ఉండటం వల్ల ధర పెరిగే అవకాశాలు ఉంటాయి. 
- బండి దత్తాత్రి, రైతు సంఘం నేత