
సికింద్రాబాద్, వెలుగు: ఇతర దేశాలతో పోలిస్తే ఇండియన్లలో టైప్-2 డయాబెటిస్ ఎక్కువగా ఉందని, దీనికి జన్యు లోపాలే కారణమని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) సైంటిస్టుల పరిశోధనలో తేలింది. ప్రతి ఆరుగురు ఇండియన్లలో ఒకరు టైప్–2 డయాబెటిస్‌కు గురవుతున్నారని, మనోళ్ల తర్వాత ఈ వ్యాధి బారినపడుతున్న వారిలో చైనా వాళ్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందుకు పొత్తి కడుపు చుట్టూ పేరుకుపోయే కొవ్వు, స్థూలకాయం, జన్యుపరంగా ఉన్న లక్షణాలే ప్రధాన కారణాలని స్పష్టమైంది. టైప్–2 డయాబెటిస్‌కు జన్యువులు ఎలా దోహదపడతాయనే దానిపై మాంచెస్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రూ మోరిస్ నేతృత్వంలో సీసీఎంబీ సైంటిస్టులు ‘డయాబెటిస్ మెటా-ఎనాలిసిస్ ఆఫ్ ట్రాన్స్-ఎత్నిక్ అసోసియేషన్ స్టడీస్’పేరుతో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా యూరోపియన్లు, తూర్పు ఆసియన్లు, దక్షిణ ఆసియన్లు, ఆఫ్రికన్లు, హిస్పానిక్స్ ప్రాంతాలకు చెందిన 1.8 లక్షల మంది టైప్–2 డయాబెటిస్ రోగులు, డయాబెటిస్ లక్షణాలు లేని 11.6 లక్షల మంది వ్యక్తుల జన్యువులపై పరిశోధించారు. డయాబెటిస్ పేషెంట్లు, సాధారణ వ్యక్తుల జన్యువుల్లో సింగిల్ న్యూక్లియోటైడ్ పాలీ మార్ఫీజం ఉన్నట్లు గుర్తించారు. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలీ మార్ఫీజం తేడాల వల్లే టైప్–2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువని, ఈ తేడాల వల్లే ఇండియన్లలో జన్యుపరమైన తేడాలు అధికంగా ఉండి జన్యువుల ద్వారానే వ్యాధి సంక్రమిస్తున్నట్లు సీసీఎంబీకి చెందిన చీఫ్ సైంటిస్టు డాక్టర్ గిరిరాజ్ చందక్ పేర్కొన్నారు. యూరోపియన్ల జన్యు డేటాను ఇండియన్స్ జీన్స్‌తో పోల్చి చూసినపుడు ఈ తేడాలు గుర్తించామని ఆయన చెప్పారు.