బకాయిలు ఇప్పించండి: ఆర్టీసీ సీసీఎస్ కమిటీ

బకాయిలు ఇప్పించండి: ఆర్టీసీ సీసీఎస్  కమిటీ
  • ఆర్టీసీ చైర్మన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సీసీఎస్ కమిటీ  వినతి

హైదరాబాద్, వెలుగు: సీసీఎస్(క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ)కు ఆర్టీసీ మేనేజ్​మెంట్ బకాయి ఉన్న రూ.1072.33 కోట్లు  ఇప్పించాలని సీసీఎస్ అధికారులు,  కమిటీ నేతలు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్​ను, ట్రాన్స్​పోర్ట్, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజును కోరారు. మంగళవారం చైర్మన్ బాజిరెడ్డిని ఆయన నివాసంలో, స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజును సెక్రటేరియెట్​లో కలిసి వినతిపత్రం అందచేశారు. 

ఆర్టీసీ కార్మికుల బేసిక్ పేలో ప్రతి నెల 7 శాతం కట్ చేసి, సీసీఎస్ లో పొదుపు చేసుకుంటారని, కార్మికుల పిల్లల చదవులు, ఇళ్ల నిర్మాణం, హాస్పిటల్ ఖర్చులు, పెళ్లి ళ్లకు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. నాలుగేండ్ల నుంచి ఆర్టీసీ మేనేజ్ మెంట్..  కార్మికుల జీతాల నుంచి కట్ చేసి  సీసీఎస్ కు ఇవ్వటం లేదన్నారు. అసలు రూ.664 కోట్లు, వడ్డీ రూ.409 కోట్లు బకాయిలు ఉన్నాయని సీసీఎస్ సెక్రటరీ మహేష్, ఇన్ చార్జి పర్సన్ కమిటీ నేతలు యాదగిరి, లక్ష్మయ్య, ఎల్ఏ రెడ్డి పేర్కొన్నారు.

 ప్రతి నెల కార్మికుల జీతాల్లో నుంచి కట్ చేస్తున్న అమౌంట్ కూడా అదే నెల సీసీఎస్ కు మేనేజ్ మెంట్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మేనేజ్ మెంట్ బకాయిలె చెల్లించకపోవటంతో లోన్ల కోసం కార్మికులు పెట్టుకున్న 7 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గతంలో సీసీఎస్ లో 46 వేల మంది మెంబర్లుగా ఉండగా చాలా మంది తమ మెంబర్ షిప్ ను రద్దు చేసుకున్నారని, ఇందులో ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారన్నారు.

 ప్రస్తుతం  32 వేల మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. వెయ్యి మంది రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్​ను కూడా సెటిల్ చేయలేదన్నారు. సీసీఎస్ లోన్లు ఇవ్వకపోవటంతో వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీకి కార్మికులు లోన్లు తీసుకుంటున్నారని సెక్రటరీ, కమిటీ నేతలు తెలిపారు.