సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతది

సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతది

బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది.  రావత్ కూతుర్లు నివాళులు అర్పించిన తర్వాత.. రావత్ దంపతుల పార్థీవ దేహాలను వాహనంపైకి ఎక్కించారు. ఢిల్లీ అంతటా రావత్  ఫోటోలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనం. ఢిల్లీ కామరాజ్ మార్గ్ లోని రావత్ ఇంటి నుంచి అంతిమయాత్ర మొదలైంది. భ‌రత భూమి పుత్రుడు రావ‌త్ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు హోరెత్తాయి. బిపిన్ రావ‌త్ అమ‌ర్ ర‌హే.. సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతదంటూ దేశ వీరుడికి జ‌నం వంద‌నాలు ప‌లికారు. సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వారి అంత్యక్రియల ఏర్పాట్లను  గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌ పూర్తి చేసింది. ఇదే రెజిమెంట్‌లో తొలుత చేరిన ఆర్మీలో చేరిన బిపిన్ ఆ తర్వాత దీనిని కమాండ్ స్థాయికి ఎదిగారు. అంత్యక్రియల్లో ఆయనకు 17 గన్‌ సెల్యూట్‌తో సైన్యం గౌరవ వందనం చేయనుంది.


బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్, 1958 మార్చి 16న ఉత్తరాఖండ్ పారిలో జన్మించారు. రావత్ కుటుంబం కొన్ని తరాలుగా ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తోంది. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా ఆర్మీలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆర్మీలో రెండో అతిపెద్ద ర్యాంక్ అయిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి వెళ్లి రిటైర్ అయ్యారు. బిపిన్ రావత్ విద్యాభ్యాసం అంతా ఆర్మీ విద్యాసంస్థల్లో కొనసాగింది. డెహ్రాడూన్, సిమ్లాలో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఖండక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరారు. మొదటి నుంచి సైన్యంలో పని చేయాలన్న లక్ష్యంగానే చదువులు కొనసాగాయి. 1978 డిసెంబర్ లో జనరల్ బిపిన్ రావత్ ఆర్మీలో చేరారు. మొదట 11 గోర్ఖా రైఫిల్స్ లో పని చేశారు. 


జనరల్ బిపిన్ రావత్ కు ఎత్తయిన పర్వతాలపై పదేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉంది. అక్కడ యుద్ధ తంత్రాలు, శత్రువులను ఎలా ఢీకొట్టాలో పట్టు సాధించారు. విదేశీ శక్తుల చొరబాట్లను నిరోధించే చాలా ఆపరేషన్స్ లో సరిహద్దుల్లో రావత్ పని చేశారు. 2016 డిసెంబర్ 17న జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నుంచి భారత ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. 2019 డిసెంబర్ 30న సీడీఎస్ గా రావత్ ను భారత ప్రభుత్వం నియమించింది. గతేడాది జనవరి 1న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ బాధ్యతలను రావత్ చేపట్టారు. 


త్రివిధ దళాలకు సంబంధించి ఏ సమాచారమైనా తీసుకుని ప్రభుత్వానికి నివేదించే అధికారం సీడీఎస్ కు ఉంటుంది. అంతటి కీలకమైన పదవికి రావత్ చేరారు. త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా.. వీరి ముగ్గురిపైన మరో అధికారిని నియమించాలని 1980ల్లో జనరల్ కేవీ కృష్ణారావు ప్రతిపాదించారు. 1999 కార్గిల్ వార్ టైంలో సీనియర్ ఆర్మీ అధికారులు ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి విన్నవించారు. త్రివిధ దళాధిపతుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కాగా.. సీడీఎస్ పదవికి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగేలా నిర్ణయించారు. సీడీఎస్ ఏర్పాటుతో త్రివిధ దళాలు, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని భావించి తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ డిఫెన్స్ అడ్వైజర్ గా రావత్ ఉన్నారు. ఆయుధాల కొనుగోలు, ట్రైనింగ్, సిబ్బంది, మిలటరీ కమాండ్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు అన్నిట్లోనూ గత రెండేళ్లుగా కీలకంగా పని చేస్తూ వచ్చారు రావత్. లడాఖ్ లో ఉద్రిక్తతల టైంలో బలగాలను సమన్వయం పరిచారు. చైనాను ఎదుర్కొనేందుకు కీలకశక్తులతో కలిసి పని చేసేలా యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. త్రివిద దళాల్లో పలు సంస్కరణలు చేపట్టారు రావత్. 


తన పనితీరుతో ఆర్మీలో చాలా కీలకంగా వ్యవహరించారు బిపిన్ రావత్. మేజర్ జనరల్ గా, కల్నల్ గా, లెఫ్టినెంట్ జనరల్ గా ఉరి సెక్టార్ లో పని చేశారు. బ్రిగేడియర్ గా సోపోర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ ను లీడ్ చేశారు. చివరకు త్రివిధ దళాలను లీడ్ చేసే cds ర్యాంక్ లో కీలకమైన పదవి చేపట్టారు. 1987లో భారత్ చైనా బార్డర్ లోని సుమ్ దో రాంగ్ వ్యాలీలో ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు రావత్ నేతృత్వంలోని బెటాలియన్ నే.. ఆర్మీ ఉన్నతాధికారులు చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా రంగంలోకి దింపారు. 1962 భారత్ చైనా వార్ తర్వాత 1987లో ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు బిపిన్ రావత్ కీలకంగా పని చేశారు. కాంగోలో ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు ఐక్యరాజ్య సమితి మిషన్ లో భాగంగా అక్కడికి వెళ్లి పరిస్థితులను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించారు రావత్. 43 ఏళ్ల కెరీర్ లో ఐక్యరాజ్య సమితి దగ్గర్నుంచి భారత్ ప్రభుత్వం అందించే ఎన్నో మెడల్స్ అందుకున్నారు రావత్. పరమ్ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, యుద్ధ సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్, ఇలా ఎన్నెన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 


1978లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 1980లో లెఫ్టినెంట్ హోదా అందుకున్నారు. 1984లో కెప్టెన్ ర్యాంకుకు చేరుకున్నారు. 1989లో మేజర్ స్థాయికి ఎదిగారు. 1998లో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి వచ్చారు. 2003లో కల్నల్ హోదా అందుకున్నారు రావత్. 2007లో బ్రిగేడియర్ హోదాకు చేరారు. 2011లో మేజర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. 2014లో లెఫ్టినెంట్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. 2017లో ఆర్మీ చీఫ్ గా, 2020లో సీడీఎస్ గా అత్యున్నత స్థాయికి బిపిన్ రావత్ చేరుకున్నారు. బుధవారం జరిగిన చాపర్ క్రాష్ లో కన్నుమూశారు.