
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని 19 ఔషధాల తయారీ యూనిట్లలోని దగ్గు మందు, యాంటీ బయాటిక్స్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) తనిఖీలు నిర్వహించింది. దగ్గు మందు తీసుకోవడంతో మధ్యప్రదేశ్ లో పిల్లలు మరణించారని రిపోర్టులు వెలువడటంతో ఈ తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటన జారీ చేసింది.
అక్టోబర్ 3 నుంచి సీడీఎస్ సీవో ఇన్స్పెక్షన్ ప్రారంభించిందని తెలిపింది. సీడీఎస్ సీవో పరీక్షించిన 6 ఔషధ నమూనాలు, మధ్యప్రదేశ్ ఎంపీఎఫ్‌డీఏ పరీక్షించిన 3 నమూనాల్లో కిడ్నీలకు హాని చేసే డైఇథిలీన్ గ్లైకాల్ (డీఈజీ), ఇథిలీన్ గ్లైకాల్(ఈజీ) లేదని చెప్పింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించడంతో తమిళనాడు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మా తయారీ యూనిట్ లోని కోల్డ్‌రిఫ్ కాఫ్ సిరప్ నమూనాలను పరీక్షించింది. ఈ నమూనాల్లో అనుమతించిన స్థాయికి మించి డీఈజీ ఉందని మినిస్ట్రీ పేర్కొంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం దగ్గు మందు అమ్మకాలను నిషేధించింది.