గాజాలో కాల్పుల విరమణ.. హమాస్-ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం

గాజాలో కాల్పుల విరమణ.. హమాస్-ఇజ్రాయెల్ మధ్య  కుదిరిన ఒప్పందం
  • శుక్రవారం (అక్టోబర్ 10) మధ్యహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటన

టెల్‌‌అవీవ్‌‌: గాజా స్ట్రిప్‌‌లో హమాస్, ఇజ్రాయిల్ మధ్య సీజ్‌‌ఫైర్ ఒప్పందం శుక్రవారం (అక్టోబర్ 10) మధ్యాహ్నం 12 గంటల(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలు) నుంచి అమలులోకి వచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ సైనిక దళాలు గాజా స్ట్రిప్‌‌ నుంచి వెనక్కి మళ్లాయని వివరించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చొరవతో రెండేండ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, హమాస్‌‌ తాజాగా అంగీకరించాయి. 

బందీలు, ఖైదీల విడుదలకు సంబంధించిన ట్రంప్ ప్రణాళికను ఆమోదించాయి. ఈ ఆమోదం జరిగిన కొన్ని గంటలకే ఇజ్రాయిల్ సైన్యం  సీజ్‌‌ఫైర్ ఒప్పందం అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. అయితే, శుక్రవారం ఉదయం కూడా గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు జరిపిందని పాలస్తీనియన్లు వెల్లడించారు. 

కానీ, ఆ తర్వాత ఎటువంటి బాంబు దాడులు జరగలేదన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన తర్వాత వేలాది మంది తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారని పాలస్తీనియన్లు పేర్కొన్నారు. కాగా.. సీజ్‌‌ఫైర్  ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికా సుమారు 200 మంది సైనికులను ఇజ్రాయెల్‌‌కు పంపనుంది. 2023 అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్‌‌లోకి చొరబడి 1,200 మందిని చంపి, 251 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో  యుద్ధం ప్రారంభమైంది.