అక్టోబర్ 4న బిహార్‌‌‌‌కు సీఈసీ బృందం..ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు

అక్టోబర్ 4న  బిహార్‌‌‌‌కు సీఈసీ బృందం..ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు

పాట్నా: బిహార్‌‌‌‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌‌‌‌(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌తో పాటు ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్.ఎస్. సంధు ఆ రాష్ట్రంలో  పర్యటించనున్నారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు పాట్నాలో పర్యటించి, ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనున్నారు. 

అంతేగాక..ఓటర్ల జాబితా, భద్రతా వ్యవస్థలు వంటి అంశాలపై వివరణాత్మక రివ్యూ చేపట్టనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ను ప్రకటించే ముందు ఎన్నికల అధికారులు రాష్ట్రాలను సందర్శించడం సహజమేనని అధికారులు శుక్రవారం వెల్లడించారు. సీఈసీ, ఎన్నికల కమిషనర్లు అక్టోబర్ 4, 5 తేదీలలో రాష్ట్రంలో ఉంటారని తెలిపారు.ఎన్నికల సన్నద్ధతను సమీక్షిస్తూనే..రాజకీయ పార్టీల ప్రతినిధులను,  పోలీసు, పరిపాలనా, రాష్ట్ర ఎన్నికల అధికారులను కలుస్తారని పేర్కొన్నారు.