
కమ్యూనిస్ట్ యోధుడు, సీపీఐ నేత దివంగత సురవరం సుధాకర్ రెడ్డి మరణం రాజకీయ నేతలతో పాటు అభిమానులలో విషాధాన్ని నింపింది. ఆయనను కడసారి చూసేందుకు వివిధ పార్టీ నేతలు, ప్రముఖులు, అభిమానులు బారులు తీరారు. ఆదివారం (ఆగస్టు 24) హైదరాబాద్ మగ్ధుం భవన్ లో ఉన్న భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ప్రముఖులు తరళి వచ్చారు.
సిద్ధాంతాల కోసం రాజీపడకుండా పనిచేశారు: సీఎం రేవంత్
సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సుధాకర్ రెడ్డి మరణం పేదలు, బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని అన్నారు. విద్యార్థి రాజకీయాలనుంచి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వరకు రాజీపడని సిద్దాంతం కొరకు పనిచేసిన నేత సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి: వెంకయ్యనాయుడు
సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరం అని ఈ సందర్భంగా అన్నారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నా వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన అని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, - వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
పేదల కోసం పరితపించిన మహనీయుడు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
సురవరం సుధాకర్ రెడ్డి - పేదల కోసమే పరితపించిన మహనీయుడు అని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మగ్ధుం భవన్ లో నివాళులు అర్పించిన ఆయన.. సురవరం లాంటి వ్యక్తిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు.
జీవితాంతం పోరాటాలతో గడిపిన మహనీయుడు: మీనాక్షి నటరాజన్
సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్. - జీవితాంతం పోరాటాలతో గడిపిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. - ఆయన కుటుంబానికి, పార్టీ శ్రేణులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
సురవరం లేని లోటు తీర్చలేనిది: కేటీఆర్
ఎన్నో విప్లవోద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో చిరస్మరణీయమైన పాత్ర పోషించిన సురవరం అస్తమయం తెలంగాణ ప్రజలకు తీరని లోటు అన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్ధతుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు రావడం వెనుక ఆయన పాత్ర ఉందని అన్నారు. సురవరం కుటంబానికి, సీపీఐ పార్టీకి సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి సీపీఐ నేతలు, కార్యకర్తలతో పాటు వివిధ పార్టీల నేతలు, అభిమానులు తరలి వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ, సీపీఐ అగ్రనేత డి.రాజా, బీఆర్ఎస్ నేత కేటీఆర్, సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి తదితరల ప్రముఖులు నివాళులు అర్పించారు.