
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందించనున్నట్లు తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.
హిమాచల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన మోడీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరుఫున రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే.. క్షతగాత్రులకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని పేర్కొన్నారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం (అక్టోబర్ 7) రాత్రి ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బిలాస్ పూర్ జిల్లాలోని బల్లు వంతెన సమీపంలో పర్యాటకులతో వెళ్తోన్న టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలంలో హిమాచల్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టాయి. బస్సుపై పడ్డ శిథిలాలు, బురదను తొలగించి ప్రయాణికులను రెస్క్యూ చేస్తున్నారు.