న్యూఢిల్లీ: నేషనల్ హైవేలపై టోల్ వసూళ్ల ప్రక్రియలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలకమైన మార్పు తీసుకొస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి, కేవలం ఫాస్టాగ్ లేదంటే యూపీఐ ద్వారా మాత్రమే టోల్ వసూలు చేయాలని భావిస్తున్నది. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ‘క్యాష్ లైన్’లను ఎత్తేసి.. కేవలం డిజిటల్ మోడ్‌లో మాత్రమే చెల్లింపులు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తే ప్రయాణికులు టోల్ చెల్లింపులకు ఫాస్టాగ్ లేదా యూపీఐ ఉపయోగించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ లేని వారు లేదా ట్యాగ్‌లో బ్యాలెన్స్ లేని వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా టోల్ పే చేయొచ్చు. ఫాస్టాగ్ కాకుండా డిజిటల్/యూపీఐ ద్వారా చెల్లిస్తే నిర్ణీత టోల్ రుసుము కంటే 1.25 రెట్లు (అంటే 25% అదనంగా) వసూలు చేస్తారు. ప్రస్తుతం నగదు చెల్లిస్తుంటే టోల్‌ను 2 రెట్లు వసూలు చేస్తున్నారు. కొత్త నిర్ణయం అమలుతో ప్రతి వెహికల్ 10 సెకండ్లలోపే టోల్గేట్ దాటేలా చర్యలు తీసుకుంటున్నది. వాహనాల క్యూ 100 మీటర్లు దాటితే ఫ్రీగా టోల్ క్రాస్ చేయొచ్చని కేంద్రం చెప్తున్నది.
