మల్లోజుల, ఆశన్నకు వై కేటగిరీ భద్రత! మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం?

మల్లోజుల, ఆశన్నకు వై కేటగిరీ భద్రత! మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం?

హైదరాబాద్, వెలుగు: తమ టీమ్​ సభ్యులతో కలిసి ఆయుధాలతో ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్‌‌‌‌, ఆశన్నకు 'వై' కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఈ మేరకు సమాచారం అందింది. 

పోలీసులకు ఆయుధాలు అప్పగించడం ద్వారా పార్టీకి మల్లోజుల, ఆశన్న నమ్మకం ద్రోహం చేశారని.. వాళ్లి ద్దరూ విప్లవ ద్రోహులని, వాళ్లకు శిక్ష తప్పదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్​ పేరిట లేఖ విడుదలైంది. ప్రస్తుతం ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి ఈ ఇద్దరు అగ్ర నేతలకు ఏమైనా జరి గితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, మిగిలిన మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకు రారని కేంద్రం భావిస్తున్నది. ఇందులో భాగంగానే  ఈ ఇద్దరికీ కొన్నాళ్ల పాటు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్​వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

ఇంకా స్వగ్రామాలకు చేరుకోలే

వేణుగోపాల్​ది పెద్దపల్లి జిల్లా కేంద్రం కాగా.. ఆశన్నది ములుగు జిల్లా నర్సింగాపూర్. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవ్​రావు మృతి ​ తర్వాత మావోయిస్టు పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో నేతలు గ్రూపులుగా విడిపోయారు. ఆయుధాలు వీడి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించుకున్న మల్లోజుల, ఆశన్న గ్రూపులు.. మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​ సీఎంల ఎదుట లొంగిపోయాయి. ఈ నెల 15న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి సరెండర్​కాగా.. ఆ తర్వాత ఆశన్న చత్తీస్​గఢ్​లో తన టీమ్​ సభ్యులతో కలిసి లొంగిపోయారు. 

ఇది జరిగి వారం రోజులు అవుతున్నా.. ఈ ఇద్దరు లీడర్లు ఇప్పటి వరకు తమ స్వగ్రామాలకు చేరుకోలేదు. మావోయిస్టులతో ముప్పు పొంచి ఉన్నందున వీరిద్దరికీ ఇప్పటికీ పోలీసుల సంరక్షణలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మల్లోజుల ప్రస్తుతం మహారాష్ట్ర లో ఉండగా, ఆశన్న చత్తీస్ గఢ్​లో ఉన్నట్లు ఉన్నారు.