‘సోలార్’ను ప్రోత్సహిస్తున్న కేంద్రం

‘సోలార్’ను ప్రోత్సహిస్తున్న కేంద్రం

రూఫ్‌ టాప్‌ సబ్సిడీ పెంచిన్రు
3 కిలోవాట్ల వరకు 40% సబ్సిడీ
నాలుగో కిలోవాట్‌‌‌‌ నుంచి పదో కిలోవాట్ వరకు 20%
కిలోవాట్‌‌‌‌ యూనిట్ ధర రూ.52 వేలుగా ఖరారు
వినియోగదారునికి లభించే ధర రూ.31,200
కిలోవాట్‌‌‌‌ సోలార్ యూనిట్ ధర రూ.52,000
ఒక కిలోవాట్‌‌‌‌కు 40 శాతం సబ్సిడీ రూ.20,800

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: 40 గిగావాట్ల సోలార్​ పవర్​ ఉత్పత్తి.. 2020 నాటికి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమిది. ఈ దిశగా ఇంటి పైకప్పుపై సోలార్​ పవర్​ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. వ్యక్తిగత ఇండ్ల టెర్రస్​లపై సోలార్​ ప్యానెల్స్ బిగించుకుని విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్న వారికి సబ్సిడీని అందిస్తోంది. గతంలో 30% ఉన్న సబ్సి డీని తాజాగా 40 శాతానికి పెంచింది. మూడు కిలోవాట్ల వరకు 40% సబ్సిడీ.. 4 కిలోవాట్ల నుంచి 10 కిలోవాట్ల వరకు 20% రాయితీని టెలిస్కోపిక్‌ విధానం ద్వారా అమలుచేస్తోంది. ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ భవనాలకు ఇచ్చే సబ్సిడీని 20 శాతానికి పరిమతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రానికి 12 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ ఉత్పత్తికి మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ రెన్యూవబుల్‌‌‌‌ ఎనర్జీ(ఎంఎన్‌ఆర్‌ఈ) సబ్సీడీని మంజూరు చేసింది. ఎస్పీడీసీఎల్‌‌‌‌ పరిధిలో 10.78 మెగావాట్లు, ఎన్‌పీడీసీఎల్‌‌‌‌ పరిధిలో 1.50 మెగావాట్ల సోలార్‌ పవర్‌ రూఫ్‌ టాప్‌కు అనుమతిచ్చింది. ఆగస్టులోనే గ్రీన్‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చినా .. టెండర్‌ ప్రక్రియ ఇటీవలే పూర్తయ్యింది. సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి కోసం ఈ నెలాఖరులో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

ఒక కిలోవాట్ కు రూ.52 వేలు
తాజాగా రెడ్‌‌కో నిర్వహించిన టెండర్లలో ఒక కిలోవాట్‌ సోలార్‌ యూనిట్‌కు రూ.52 వేల ధర ఖరారైంది. దానిలో 40% కేంద్రం రాయితీ కల్పిస్తుంది. అంటే కిలో వాట్‌ కు రూ.20,800 రాయితీ పోగా వినియోగదారునికి రూ.31,200కు లభిస్తుంది. ఈ సోలార్ యూనిట్ ​నుంచి ఒక నెలకు 110 నుంచి 125 యూనిట్లను ఉత్పత్తి చేసుకునే వీలుంది. వినియోగాన్ని బట్టి సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నెలవారీగా రూ.400 బిల్లు వచ్చే వారికి 3 కిలోవాట్ల సోలార్‌ ప్యానళ్లు అవసరమవుతాయి. అంటే ఖర్చు రూ.1,56,000 అవుతోంది. సబ్సిడీ రూ.62,400(40శాతం) కేంద్రం భరిస్తుంది. మిగతా రూ.93,600 లబ్ధిదారుడు చెల్లించాలి. కనీసం వంద చదరపు అడుగుల భవనం టెర్రస్‌పై ఏటా 1,500 యూనిట్ల నుంచి 1,800 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే వీలుంటుంది.

ప్యానళ్ల ధరలు తగ్గినయ్‌
గతంలో సోలార్ ప్యానల్స్ ధరలు కిలోవాట్‌‌కు రూ.91 వేల వరకు ఉండేవి. 2015 నుంచి సోలార్‌ పవర్‌ పాలసీ రావడంతో రూఫ్‌ టాప్​లు, సోలార్‌ పార్కులు పెరిగి.. ప్యానళ్ల ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం కిలోవాట్​ సోలార్​ ప్యానెళ్ల ధర రూ.52 వేలకు తగ్గింది. దీంతో సామాన్య, మధ్యతరగతి వారు కూడా సోలార్‌ ప్యానళ్లను పెట్టు కునే వీలు కలుగుతోంది.

మిగిలితే అమ్ముకోవచ్చు
ఎక్కువ సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి చేసే వారు తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన దానిని డిస్కంకు అమ్ముకోవచ్చు. నెట్ మీటరింగ్ ద్వారా యూనిట్​ను రూ.4.08కి డిస్కంలు కొనుగోలు చేస్తాయి. రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థాపిత సామర్థ్యం 3,600 మెగావాట్లకు చేరింది. దాదాపు 5 వేల మంది రూఫ్‌ టాప్ ద్వారా 98 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎస్‌పీడీసీఎల్‌‌‌‌ పరిధిలో 90 మెగావాట్లు, ఎన్‌పీడీసీఎల్‌‌‌‌ పరిధిలో 10 మెగావాట్ల సోలార్‌ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రూఫ్‌ టాప్ ద్వారా ఉత్పత్తి అయి, లైన్‌‌కు అనుసంధానమైన విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. విద్యుత్ అధికారులను సంప్రదించి నెట్ మీటరింగ్ కనెక్షన్‌ పొందవచ్చు. విద్యుత్ అధికారులు ప్లాంట్‌ను పరిశీలించి అంతా ఓకే అనుకుంటే టెక్నికల్ ఫీజిబులిటీ సర్టిఫికెట్ ఇస్తారు.