- 92.04 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
- పార్కుకు రూ.13.88 కోట్లు
- ప్రకటించిన మంత్రి కిషన్‍రెడ్డి
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో రామాయణం థీమ్ పార్కుకు సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది. ఈ మేరకు టూరిజం శాఖ మంత్రి కిషన్‍రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ప్రసాద్ ఫండ్స్ నుంచి రూ.92.04 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఇందులో క్రాఫ్ట్ విలేజ్, రామాయణం థీమ్ పార్కుకు రూ.13.88 కోట్లు ఇవ్వనున్నారు. 2003లో గోదావరి పుష్కరాల తర్వాత రామాయణం థీమ్‍పార్కు నిర్మాణం కోసం ప్రపోజల్స్ రెడీ చేయగా, 2013లో ఏపీటీడీసీ థీమ్‍పార్కుకు రూ.2 కోట్లు కేటాయించింది.
విభజనతో పనులకు బ్రేక్
రాష్ట్ర విభజనకు ముందు థీమ్‍పార్కు కోసం భద్రాచలం టౌన్‍లోని శ్రీరామ్‍నగర్‍కాలనీలో 11.71 ఎకరాలను కేటాయించారు. ఏపీటీడీసీ థీమ్‍పార్కుతో పాటు ట్రైబల్ హబ్ నిర్మాణానికి పనులు మొదలుపెట్టింది. దీని కోసం కడప నుంచి సాండ్‍స్టోన్ కూడా తెప్పించారు. ఇంతలోనే రాష్ట్ర విభజన జరిగి పార్కు నిర్మాణ ప్రదేశమైన శ్రీరామ్‍నగర్‍కాలనీ ఆంధ్రాలోకి వెళ్లిపోయింది. దీంతో పనులు మూలకు పడ్డాయి.
కరకట్ట, ఆర్‍అండ్‍బీ ఆఫీసు దగ్గర..
రామాయణం థీమ్‍పార్కు, క్రాఫ్ట్ విలేజ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కేటాయించడంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వంతెన వద్ద ఉన్న కరకట్ట దగ్గర రెండు నుంచి మూడెకరాలు, ఆర్‍అండ్‍బీ ఆఫీస్దగ్గర ఆరెకరాలు పార్కు, విలేజ్ కోసం కేటాయించనున్నారు. భక్తులు టౌన్‍లోకి ప్రవేశించగానే చక్కటి అనుభూతి కల్పించేలా ఈ రామాయణ థీమ్ పార్కు, విలేజ్ క్రాఫ్ట్ నిర్మాణాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రామాయణంలోని ఘట్టాలు భక్తులకు కళ్లకు కట్టేలా ఈ పార్క్ ఉండనుంది.
రామయ్యకు వెండి చెంబు, కమండలం
భద్రాద్రి రాముడికి హైదరాబాద్కు చెందిన ధూళిపాల విజయరాంప్రసాద్, సరళ దంపతులు శుక్రవారం వెండి చెంబు, కమండలం అందజేశారు. 340 గ్రామలు వెండితో రూ.30,116 ఖర్చు పెట్టి వీటిని తయారు చేయించారు.