సగటు ఉష్ణోగ్రత 0.7 డిగ్రీలు పెరిగింది.. అందుకేనా ఈ విపత్తులు

సగటు ఉష్ణోగ్రత 0.7 డిగ్రీలు పెరిగింది.. అందుకేనా ఈ విపత్తులు

భారతదేశంలో అధిక వర్షాలు, వరదలపై కేంద్రం స్పందించింది. లోక్‌సభలో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రుతుపవనాల సీజన్ లో వాయువ్య భారతదేశంలోని రాష్ట్రాల్లో అధిక, అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. విపత్తు నిర్వహణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్రాలదే అని గుర్తు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం - 2005 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటాయని, ఆ ప్రకారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో డిజాస్టర్  మేనేజ్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయాలన్నారు. తుఫానులు, వర్షాల కారణంగా అటవీ ప్రాంతానికి నష్టం జరిగినట్టు సమాచారం లేదని వివరించారు.

2020లో వాతావరణ మార్పులపై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రచురించిన నివేదిక (పుస్తకం) ప్రకారం... 1901 -2018 మధ్యకాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల మేర పెరిగింది. రోజుకు 150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం  నమోదయ్యే ఉదంతాలు 1950 - 2015 మధ్యకాలంలో 75శాతం పెరిగాయి.

1951 -2015 మధ్యకాలంలో కరవు పరిస్థితులు కూడా గణనీయంగా పెరిగాయి. 1998 -2018 మధ్యకాలంలో రుతుపవనాల అనంతరం అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుల సంఖ్య పెరిగింది.