తెలంగాణపై కేంద్రానిది ముమ్మాటికీ వివక్షే

తెలంగాణపై కేంద్రానిది ముమ్మాటికీ వివక్షే
  • హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించినం: మంత్రి పొన్నం
  • కేంద్రం నుంచి నగరానికి ఏం తెస్తారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి
  • పైసా నిధులు తేని బండి, కిషన్ రెడ్డికి మంత్రులుగా కొనసాగే అర్హత లేదు
  • బీఆర్​ఎస్​ నేతలు కాళేశ్వరం పై తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని  మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్రం నుంచి హైదరాబాద్​నగరానికి ఏం తెస్తారో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పాలని డిమాండ్ ​చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో హైదారాబాద్ నగరానికి సంబంధించి  మౌలిక సదుపాయాల కల్పన,  పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా రూ.10 వేల కోట్ల నిధులను సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటాయించారని అన్నారు. 

శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పొన్నం ప్రభాకర్​ మాట్లాడారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్​తో పాటు మెట్రోకు కూడా నిధులు కేటాయించామని  తెలిపారు.  నూతనంగా ఏర్పడిన హైడ్రా, మూసీ ప్రక్షాళనకు కూడా  కేటాయింపులు చేసినట్టు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, గతంలో టూరిజం మంత్రి గా ఉన్నా ఆయన హైదరాబాద్ కు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని చెప్పారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండిసంజయ్ కేంద్రం నుంచి​ ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. 

కేంద్రం స్పెషల్​ ప్యాకేజీ ఇవ్వాలి

హైదరాబాద్​అభివృద్ధికి కేంద్ర సర్కారు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి పొన్నం డిమాండ్​చేశారు. ఎస్​ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ ద్వారా రోడ్ల నిర్మాణాలు, నాళాల పునరుద్ధరణ చేపట్టడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. తాగునీటికి అమృత్ పథకం కింద నిధులు కేటాయించాలని అన్నారు. ఇండ్ల నిర్మాణానికి, వీధి వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేయాలని కోరారు.

 ‘‘కేంద్ర బడ్జెట్ చాల బాగుందని కేంద్ర మంత్రులు బండి సంజయ్ , కిషన్ రెడ్డి చెబుతున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అంటున్నారు.  ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిటీకి రూపాయి తీసుకురాలేదు. వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు” అని అన్నారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని అన్నారు. 

మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

కేంద్రం నిధులు ఇవ్వలేదని తాము అంటుంటే.. బీజేపీ వాళ్లు తమ దిష్టిబొమ్మలను తగులబెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు.  కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అఖిలపక్షాన్ని మోదీ వద్దకు తీసుకువెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. 

బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.  కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు జరిగిన అన్యాయం జరిగినందునే  నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్​కాట్​ చేసినట్టు తెలిపారు. తమ నిరసన తెలిపేందుకు నీతి ఆయోగ్​ ఒక వేదిక అని పేర్కొన్నారు.  బీఆర్ఎస్​ నేతల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన విహార యాత్రలా జరిగిందని మంత్రి పొన్నం విమర్శించారు.

 కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టకపోవడంతో మనకు నష్టం జరిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్​ నేతలు తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్​ చేశారు.  రైతులను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని పొన్నం స్పష్టం చేశారు.