జూలై 22 నుంచి ఆగస్టు 12 దాకా పార్లమెంట్ సమావేశాలు : కిరణ్ రిజిజు

జూలై 22 నుంచి ఆగస్టు 12 దాకా పార్లమెంట్ సమావేశాలు : కిరణ్ రిజిజు
  • ఈ నెల 23న కేంద్ర బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూ ర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 కేబినెట్ తన తొలి బడ్జెట్ ను ఈ నెల 23న లోక్‌‌‌‌సభలో ప్రవేశపెట్టనుంది. 2024----–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కాగా.. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ సిఫార్సుపై ఈ నెల 22  నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయని తెలిపారు.

2024-–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్​ను జులై 23న లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు అప్పట్లోనే చెప్పారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్, బీజేపీకి సొంతంగా మెజారిటీ లేని మొదటి బడ్జెట్ ఇదే. దీంతో వరుసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ నెలకొల్పబోతున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించారు.