మేడిగడ్డ డిజైన్ ఎల్​అండ్​టీదే!

మేడిగడ్డ డిజైన్ ఎల్​అండ్​టీదే!
  •     ఎన్డీఎస్ఏ కమిటీకి చెప్పిన సెంట్రల్​ డిజైన్స్​ ఆఫీస్ అధికారులు 
  •     అన్నారం, సుందిళ్ల డిజైన్లు మాత్రమే తాము చేశామని వెల్లడి
  •     అన్నారం, సుందిళ్ల డిజైన్లు మాత్రమే  చేశామని వెల్లడి
  •     మేడిగడ్డ డిజైన్ ఇచ్చింది తాము కాదన్న ఎల్​ అండ్​ టీ
  •     అప్పటి సర్కారు డిజైన్ల ప్రకారమే నిర్మించామని వివరణ

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి డిజైన్​ చేసింది ఎల్​ అండ్​ టీ సంస్థేనని నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) నిపుణుల కమిటీకి సెంట్రల్​ డిజైన్స్​ ఆఫీస్​ (సీడీవో) అధికారులు చెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మాత్రమే తాము డిజైన్లు చేసినట్టు వివరించారు. ఇండియన్​ స్టాండర్డ్​ కోడ్​ (ఐఎస్​ కోడ్)​ ప్రకారమే బ్యారేజీలకు డిజైన్లు చేశామని కమిటీకి సీడీవో అధికారులు వివరించారు. 

చంద్రశేఖర్​ అయ్యర్​ నేతృత్వంలోని ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ గురువారం రెండో రోజు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధికారులను ఒక్కొక్కరిని పిలిచి వివరాలు సేకరించింది. సీడీవో అధికారులు, నిర్మాణ సంస్థలు ఎల్​ అండ్​ టీ, నవయుగ, వ్యాప్కోస్​, అఫ్కాన్స్​ సంస్థల నుంచి వివరాలు తీసుకున్నది. ఉదయం 9.30 నుంచి  రాత్రి 10 వరకు దాదాపు 12.30 గంటల పాటు మారథాన్​ విచారణ చేపట్టింది. 

మేడిగడ్డ డిజైన్లను ఎల్​ అండ్​ టీ సంస్థనే ఇచ్చిందని నిపుణుల కమిటీకి సీడీవో అధికారులు చెప్పినా.. తాము చేయలేదని ఎల్​అండ్​టీ  స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. గత బీఆర్​ఎస్​ సర్కారు​ ఇచ్చిన డిజైన్​, డ్రాయింగ్​ల ప్రకారమే తాము బ్యారేజీ నిర్మాణం చేపట్టామని తెలిపినట్టు సమాచారం.  మేడిగడ్డ డ్యామేజీలకు తాము బాధ్యులం కాదని ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీకి ఎల్ ​అండ్ ​టీ స్పష్టం చేసినట్టు తెలిసింది. 

కాగా, బ్యారేజీలకు డిజైన్లు ఎవరు చేశారు?  ఫీల్డ్​కు వెళ్లారా?  ఏ మోడల్​ ప్రకారం డిజైన్లు రూపొందించారు? లాంటి ప్రశ్నలను సీడీవో అధికారులకు ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ సంధించినట్టు తెలిసింది. ఐఎస్​ కోడ్​ ప్రకారం బ్యారేజీలను డిజైన్​ చేశామని, ఫీల్డ్​కు వెళ్లే అధికారం తమకు లేదని సీడీవో అధికారులు వివరించినట్టు తెలిసింది. ఆ డిజైన్లను ఇవ్వాల్సిందిగా కమిటీ అడగ్గా.. వాటిని విజిలెన్స్​ అధికారులు తీసుకెళ్లారని, ప్రస్తుతం తమ వద్ద ఆ డిజైన్లు లేవని సీడీవో అధికారులు చెప్పినట్టు తెలిసింది. 

ఎల్​ అండ్​ టీ సంస్థ వద్దనున్న డిజైన్లను తీసుకుని నిపుణుల కమిటీకి ఇచ్చినట్టు సమాచారం. డిజైన్లకు సంబంధించి 9 రకాల అంశాలను తాము చెప్పిన ఫార్మాట్​లో ఇవ్వాల్సిందిగా కమిటీ ఆదేశించినట్టు తెలిసింది. కాగా, ఓ అండ్​ ఎం (ఆపరేషన్స్​ అండ్​ మెయింటెనెన్స్​) డిపార్ట్​మెంట్​తో గురువారం మీటింగ్​ జరగాల్సి ఉన్నా.. సమయాభావం వల్ల శుక్రవారానికి వాయిదా వేశారు. 

బ్యారేజీల ఆపరేషన్​ ప్రొటోకాల్​పై ఆరా

బ్యారేజీల ఆపరేషనల్​ ప్రొటోకాల్​పైనా ఎన్​డీఎస్​ఏ కమిటీ ఆరా తీసినట్టు తెలిసింది. వర్షాకాలం సీజన్​కు ముందు.. సీజన్​ తర్వాత చేపట్టిన ఆపరేషన్​ ప్రొటోకాల్​ వివరాలను చెప్పాల్సిందిగా అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. ఆయా సందర్భాల్లో గుర్తించిన అంశాలేంటో చెప్పాలని వారిని అడిగినట్లు తెలిసింది. మేజర్​ సమస్యలేమైనా గుర్తిస్తే.. వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ప్రశ్నించినట్టు తెలిసింది. కన్​స్ట్రక్షన్​కు ముందు తీసుకున్న చర్యలేంటి?  ఏ టెస్టులు చేశారు? అని నిర్మాణ సంస్థలను కమిటీ నిపుణులు ప్రశ్నించినట్టు తెలిసింది. క్వాలిటీ నిర్ధారణ ఎలా చేశారు? ఎన్ని శాంపిళ్లను సేకరించారు? లాంటి వివరాలను రాబట్టినట్టు తెలుస్తున్నది. కాగా, ఓ అండ్​ ఎంకు సంబంధించి 2019 నుంచి ఇప్పటిదాకా ఉన్న రిపోర్టులను కమిటీ అడిగినట్టు తెలిసింది. 

ఇవాళ ఓ అండ్​ ఎం, ఎస్​డీఎస్ఓతో సమావేశం

ఓ అండ్​ ఎం అధికారులతో గురువారమే మీటింగ్​ జరగాల్సి ఉన్నా.. సీడీవో, నిర్మాణ సంస్థల నుంచి వివరాలను తీసుకునేటప్పటికే లేట్​ నైట్​ కావడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం ఓ అండ్​ ఎం అధికారుల నుంచి మెయింటెనెన్స్​కు సంబంధించిన వివరాలను తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. వారితో పాటు క్వాలిటీ కంట్రోల్​, స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ ఆర్గనైజేషన్​ అధికారులతో ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించనున్నది. అనంతరం మధ్యాహ్నం రాజేంద్రనగర్​లోని ఇంజనీరింగ్​ రిసెర్చ్​ ల్యాబ్​కు వెళ్లి ప్రాజెక్టుల రన్నింగ్​ మోడల్స్​పై అధ్యయనం చేయనున్నది.