కేంద్రం నిధులు రాష్ట్రం గోల్మాల్

కేంద్రం నిధులు రాష్ట్రం గోల్మాల్
  • నిధుల కోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో డాక్యుమెంట్లు మిస్సింగ్
  • సరిగా మ్యాపింగ్ చేయలేదు
  • 2022 , 23 విద్యా సంవత్సరం తొలి క్వార్టర్ నిధుల లేఖలో డొల్ల
  • కార్పొరేట్ ఫినాన్స్ ఇన్ స్టిట్యూషన్ లో జమ చేయాల్సిన కేంద్రం వాటా వడ్డీ 6 కోట్లకు బదులు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లే జమ చేసింది

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖకి కేంద్ర విద్యాశాఖ ఘాటు లేఖ రాసింది. సమగ్ర శిక్షా అభియాన్ నిధుల కోసం పంపిన డాక్యుమెంట్లలో లోపాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. తొలి క్వార్టర్ నిధుల కోసం ఇటీవల కేంద్ర విద్యాశాఖకు రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. 2022.. 2023 ఏడాదికి సమగ్ర శిక్షా అభియాన్ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం  పంపిన  ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం డ్యాక్యుమెంట్ల మిస్సింగ్ తో పాటు పలు తప్పులు ఉన్నాయంటూ తిప్పి పంపింది. అలాగే సరిగా మ్యాపింగ్ చేయలేదని లేఖలో తెలిపింది.  ప్రొసీజర్ ప్రకారం అన్ని మ్యాపింగ్ చేయాలని  కేంద్రం స్పష్టం చేసింది.

కార్పొరేట్ ఫినాన్స్ ఇన్ స్టిట్యూషన్ లో జమ చేయాల్సిన కేంద్ర వాటా వడ్డీని 6 కోట్లకు బదులు కేవలం 2 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని లేఖలో కేంద్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులోనూ కొరత ఉందని కేంద్రం తెలిపింది. 1072 కోట్ల కేంద్ర వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 714 కోట్లు కేటాయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర వాటాలను కలిపి 800 కోట్లను చూపించిందని లేఖలో తెలిపింది.

ఇందులో కేంద్ర వాటా 479.9 కోట్లు, రాష్ట్ర వాటా 319.9 కోట్ల రూపాయలుగా చూపెట్టిందని ఘాటుగా లేఖ రాసింది. రాష్ట్ర వాటానే కాదు కేంద్ర వాటాను కూడా మార్చడంపై కేంద్ర విద్యాశాఖ సీరియస్ అయింది. ఈ లోపాలను సరిచేసి మళ్లీ ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేంద్రం లేఖ రాసింది.