ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ, ఏపీలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో 2, ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.  తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. మార్చి 13న పోలింగ్ జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో పూర్తి కానుంది. 

అటు ఏపీలోనూ 13 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. అందులో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. ఈ స్థానాలన్నింటికీ కూడా మార్చి 13న పోలింగ్, 16న కౌంటింగ్ జరగనుంది.