3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‍ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీల గడవు ఈ ఏడాది మార్కుచితో ముగియనుంది. దీంతో ఈ 3రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‍ను భారత ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం 2:30 గంటలకు వెల్లడించనుంది. నాగాలాండ్ అసెంబ్లీ గడువు మార్చి 12తో ముగుస్తుండగా.. మేఘాలయ మార్చి 15, త్రిపుర అసెంబ్లీ కాలపరిమితి మార్చి 2023తో ముగియనుంది.

త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా.. ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఉన్నారు. గతేడాది మేలో విప్లవ్ కుమార్‌ను తప్పించిన బీజేపీ అధిష్ఠానం మాణిక్‍కు సీఎం బాధ్యతలు అప్పగించింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి .మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అధినేత కాన్రాండ్ సంగ్మా సీఎంగా ఉన్నారు. ఆయన బీజేపీతో పాటు..ఇతర ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేఘాలయలో  60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక నాగాలాండ్‍లో నేషనల్ డెమొక్రటివ్ ప్రొగ్రెసివ్ పార్టీ అధికారంలో ఉంది. నెఫియు రియో  సీఎంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలోనూ బీజేపీ భాగస్వామిగా ఉంది. నాగాలాండ్ లోనూ 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ఏడాది ఈ మూడు రాష్ట్రాలతో పాటు.. మరో ఆరు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరం, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‍గఢ్, రాజస్థాన్  అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.