
- ఆన్లైన్ గేమింగ్‌కు రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం
- ]గేమర్లకు కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి
- హద్దు దాటే కంపెనీలపై ప్రాసిక్యూషన్
- ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కోసం ఫైనల్ రూల్స్‌ను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ (మెయిటీ) గురువారం ప్రకటించింది. డ్రాఫ్ట్ రూల్స్‌ను ఈ ఏడాది జనవరిలోనే తెచ్చారు. ఫైనల్ రూల్స్‌లో భాగంగా సెల్ఫ్రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ (ఎస్ఆర్ఓ) కొన్నింటిని ప్రభుత్వం అపాయింట్ చేయనుంది. ఈ ఎస్ఆర్ఓలలో ఇండస్ట్రీ ప్రతినిధులు, ఎడ్యుకేషనిస్టులు, ఇతర ఎక్స్పర్టులు, సైకాలజీ ఎక్స్పర్టులు సహా ఇతర నిపుణులు ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం మూడు ఎస్ఆర్ఓలను నోటిఫై చేస్తామని, ఆ తర్వాత మరిన్నింటిని యాడ్ చేస్తామని వెల్లడించింది. ఆయా గేమ్స్ బెట్టింగ్‌లు ఆఫర్ చేస్తున్నాయా లేదా అనే ప్రాతిపదికన పర్మిషన్ ఇవ్వడానికి ఈ ఎస్ఆర్ఓలు బాధ్యత వహిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బెట్టింగ్‌కు అవకాశమిస్తూ, రియల్ మనీ ట్రాన్సాక్షన్లు జరుపుతున్న గేమ్స్‌ను మాత్రమే తాము రెగ్యులేట్ చేస్తున్నామని ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. బెట్టింగ్‌కు అవకాశం లేదని ఎస్ఆర్ఓ భావిస్తే అలాంటి రియల్ మనీ గేమ్‌కు ఎస్ఆర్ఓ పర్మిషన్ ఇవ్వొచ్చని రూల్స్‌లో పేర్కొన్నారు. ఆన్లైన్ గేమర్స్‌కు కూడా కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరని ఐటీ మినిస్ట్రీ ఈ రూల్స్‌లో స్పష్టం చేసింది. కొత్త రూల్స్‌ను పాటించని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. అనుమతి పొందిన ఎస్ఆర్ఓల వద్ద తమ గేమ్ రిజిస్టర్ చేసుకుని, వాటి అనుమతిని గేమింగ్ కంపెనీలు పొందడం తప్పనిసరని పేర్కొన్నారు.