బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లనే వాడండి

బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లనే వాడండి
  • వాహనదారులకు కేంద్రం సూచన
  • అవగాహన కల్పించాలని కలెక్టర్లకు లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: హెల్మెట్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు కీలక సూచన చేసింది. ఐఎస్ఐ మార్కు, బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని సూచించింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించాలని, వినియోగదారులకు అవగాహన కల్పించాలని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశామని కేంద్ర వినియోగదారుల శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నాసిరకం హెల్మెట్ల తయారీ, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 కోట్లకు పైగా టూ వీలర్స్ ఉన్నాయని, ఈ వాహనాలు నడుపుతున్న వారి భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. మోటారు వెహికల్ యాక్ట్ –1988 ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అయినప్పటికీ దాని ప్రభావం ధరించే హెల్మెట్ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని గుర్తు చేసింది. ప్రామాణికంలేని హెల్మెట్‌‌‌‌ల వాడకం ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది.  నాణ్యత లేని హెల్మెట్లను అరికట్టేందుకు 2021లోనే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌‌‌‌ను అమల్లోకి తెచ్చినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 176 సంస్థలకు మాత్రమే బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే విక్రయించే అనుమతి ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. 

అందువల్ల దేశంలో నాణ్యతా లోపంతో తయారు చేస్టున్న హెల్మెట్లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్లకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. నాసిరకం హెల్మెట్లను తయారు చేస్తున్న సంస్థలు, వాటిని విక్రయించే రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లా అధికారులు వ్యక్తిగతంగా ఆసక్తి చూపాలని, ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, రహదారి భద్రతా ప్రచారాలతో డ్రైవ్‌‌‌‌ నిర్వహించాలని పేర్కొంది. దీనికి మద్దతుగా అధికారులు, పోలీసు విభాగాలతో సమన్వయంతో ముందుకెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.