పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే పుకార్లను నమ్మవద్దని, భయాందోళనతో కొనుగోళ్లు చేయవద్దని ప్రభుత్వం కోరింది. దేశంలో 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉందని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడారు. 

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం లేదని స్పష్టం చేశారు. నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. గత 24 గంటల్లో 50 మంది భారతీయ నావికులను స్వదేశానికి రప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 540 మందితో కూడిన 20 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని, వారంతా సురక్షితంగా ఉన్నారని, వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.

ఐదేళ్ల తర్వాత ఇరాన్ గ్యాస్ కొనుగోలు చేసిన భారత్

అంతర్జాతీయ ఇంధన రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో, దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మళ్లీ ఇరాన్ నుంచి ఎల్‌‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కార్గోను కొనుగోలు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశీయ అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న భారత్‌‌కు ఇది ఉపశమనం కలిగించే అంశం. గతంలో 2019లో అమెరికా కఠిన ఆంక్షలు విధించిన తర్వాత ఇరాన్ నుంచి చమురు మరియు గ్యాస్ దిగుమతులను భారత్ నిలిపివేసింది. తాజా ఒప్పందం ప్రకారం, మొదటి విడత ఎల్‌‌పీజీ కార్గో త్వరలోనే భారత తీరానికి చేరుకోనుంది.