సోలార్ గ్రామానికి కోటి నజరానా.. ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు చర్యలు

సోలార్ గ్రామానికి కోటి నజరానా.. ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు చర్యలు
  •     ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 8 గ్రామాల ఎంపిక
  •     అత్యధికంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి ఇవ్వనున్న కేంద్రం
  •     సబ్సిడీతో యూనిట్ల ఏర్పాటు

ములుగు, వెలుగు : సౌర విద్యుత్ వినియోగంలో ముందుండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. ఇది మోడల్ సోలార్ విలేజ్ పథకంలో భాగంగా ఇండ్ల పైకప్పులపై సౌర ఫలకాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద, ఎక్కువ సౌర విద్యుత్​ను ఉపయోగించే గ్రామాలకు నజరానా లభిస్తుంది. విద్యుత్​వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో పాలకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు.

 అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్​ వినియోగానికి ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని సహజసిద్ధ వనరులను వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో టీజీ రెడ్కో సంస్థ ద్వారా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (పీఎంఎస్​జా ఎంబీవై) పథకాన్ని అమలు చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తోంది. ఎన్నికల కోడ్​కు ముందు ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు సహకారం అందించారు. 

ములుగు జిల్లాలో 8 గ్రామాలు ఎంపిక..

ములుగు జిల్లాలో 8 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సోలార్​ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రంతోపాటు వెంకటాపూర్, గోవిందరావుపేట మండల కేంద్రాలతోపాటు పస్రా, చల్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలంలోని కమలాపురం, వెంకటాపురం గ్రామాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ గ్రామాలను ఎంపిక చేశారు. గత మేలో ఈ స్కీం జిల్లాలో విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 400కుపైగా సోలార్​ప్యానెల్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. 

ఎక్కువ ప్యానెల్స్​ఉన్న విలేజీకి రూ.కోటి నజరానా..

విద్యుత్ వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.200ల యూనిట్ల వరకు సబ్సిడీ అమలు చేస్తోంది. అయితే నెలకు రూ.2 వేలకు పైగా విద్యుత్ బిల్లులు వచ్చే వారికి ఈ సోలార్​ప్యానెల్ ఉపయోగకరంగా ఉంటుంది. రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం కల్పిస్తుండగా ఒకటి, రెండు, మూడు కిలో వాట్​విద్యుత్ వినియోగదారులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది.

 కిలో వాట్ సోలార్​ప్యానెల్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు రూ.30 వేల సబ్సిడీ, 2 కిలో వాట్ల సోలార్​ విద్యుత్ సామర్థ్యం గల పరికరం కోసం రూ.60 వేలు, 3 కిలో వాట్ల వినియోగదారులకు రూ.78 వేల సబ్సిడీ ఉంటుంది. ఇందు కోసం వంద నుంచి మూడు వందల చదరపు అడుగుల భవన రూఫ్​ అవసరం ఉంటుంది. బిల్డింగ్​ఉన్నవారికి అయితే సక్రమంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  ములుగు జిల్లాలో ఎంపిక చేసిన 8 గ్రామాల్లో ఎక్కువ సోలార్​ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న గ్రామాన్ని గుర్తించి రూ.కోటి నజరానా అందించనున్నారు. 

ఆన్​లైన్​ లో దరఖాస్తు.. 

సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వినియోగదారులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://pmsuryaghar.gov.in పోర్టల్ లో లాగిన్​ అయ్యి ఇంటికి సంబంధించిన యూఎస్సీ నంబర్ ను ఎంటర్​ చేస్తే వివరాలు వస్తాయి. దీని ద్వారా ఎంత కిలో వాట్​పరికరాలు అవసరమో వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం రెడ్కో సంస్థ ప్రతినిధులు, విద్యుత్​శాఖ అధికారులు పరిశీలించి యూనిట్​ ఏర్పాటుకు అనుమతులు ఇస్తారు. 

ప్రత్యేకమైన మీటర్​ను ఏర్పాటు చేసి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లులో సోలార్​ విద్యుత్, పవర్ ద్వారా వచ్చే విద్యుత్ ​ఏ మేరకు వినియోగించారో లెక్కించి బిల్ ఇస్తారు. ఒకవేళ సోలార్ ​ద్వారా ఎక్కువ యూనిట్లు ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్ ఎన్​పీడీసీఎల్​కు విక్రయించడం ద్వారా వినియోగదారుడు సొమ్ము చేసుకోవచ్చు.