ఈపీఎస్ పెన్షన్‌‌‌‌‌‌‌‌ రూ.3 వేలకు.. ప్రస్తుతం ఉన్న రూ.వెయ్యి నుంచి పెంచే అవకాశం

ఈపీఎస్ పెన్షన్‌‌‌‌‌‌‌‌ రూ.3 వేలకు.. ప్రస్తుతం ఉన్న రూ.వెయ్యి నుంచి పెంచే అవకాశం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్‌‌‌‌‌‌‌‌) కింద ఇచ్చే  కనీస పెన్షన్‌‌‌‌‌‌‌‌ను ప్రస్తుతం ఉన్న  రూ.1,000 నుంచి రూ.3,000కి పెంచే అవకాశం ఉంది.   కనీస పెన్షన్ పెంపు రాబోయే కొన్ని నెలల్లో అమలులోకి రావొచ్చని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని కోట్ చేస్తూ  మనీకంట్రోల్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ చేసింది. “ప్రభుత్వం కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.3 వేలకి పెంచే అవకాశం ఉంది. ఇది ఎప్పటి నుంచో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న నిర్ణయం” అని ఒక అధికారి తెలిపారు.

2020లో, కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్‌‌‌‌‌‌‌‌ను రూ.2,000కి పెంచాలని అదనపు బడ్జెట్ సహాయంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపింది. కానీ దీనికి ఆమోదం దొరకలేదు. 2025లో, ప్రీ-బడ్జెట్ చర్చల సందర్భంగా, ఈపీఎస్‌‌‌‌‌‌‌‌  రిటైర్డ్ ఉద్యోగుల బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌ను కలిసి కనీస ఈపీఎస్‌‌‌‌‌‌‌‌ పెన్షన్‌‌‌‌‌‌‌‌ను నెలకు రూ. 7,500కి పెంచాలని కోరింది.  కానీ వారికి ఎలాంటి హామీ లభించలేదు. ఈపీఎస్ మొత్తం కార్పస్ రూ.8 లక్షల కోట్లు దాటగా, ఈ స్కీమ్ కింద ఉన్న  మొత్తం పెన్షనర్లు సుమారు 78.5 లక్షల మంది. వీరిలో 36.6 లక్షల మంది కనీస పెన్షన్ రూ.1,000 పొందుతున్నారు.

“అధిక పెన్షన్ (రూ.3,000) ఇస్తే అయ్యే అదనపు ఖర్చులపై  కార్మిక మంత్రిత్వ శాఖ లెక్కలేస్తోంది” అని పైన పేర్కొన్న అధికారి తెలిపారు. 2023–24లో, ఈపీఎస్‌‌‌‌‌‌‌‌ కింద పెన్షనర్లకు కనీస పెన్షన్ అందించడానికి ప్రభుత్వం  రూ.1,223 కోట్లు ఖర్చు చేసింది.   ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో చేసిన  ఖర్చు  రూ.970 కోట్ల కంటే 26 శాతం ఎక్కువ.  ఈ నెల ప్రారంభంలో కూడా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ఒక పార్లమెంటరీ ప్యానెల్, ఖర్చులు పెరగడంతో ఈపీఎస్‌‌‌‌‌‌‌‌  కింద ఇచ్చే కనీస పెన్షన్ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను కూడా “తక్షణమే” పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖను కోరింది.  “గత 11 ఏండ్లలో  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  72 శాతం పెరిగింది. పెన్షన్లను ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్చాలని  అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎన్‌‌‌‌‌‌‌‌ఓ) సూచిస్తోంది”అని ఆర్థిక వేత్త  సందీప్ వెంపటి అన్నారు. ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉండడంతో  కనీస పెన్షన్ పెంపు పరిమితంగా ఉంటుందని అంచనా. 

ఈపీఎస్‌‌‌‌‌‌‌‌ గురించి..
ఈపీఎస్‌‌‌‌‌‌‌‌ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనేజేషన్ (ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ) నిర్వహిస్తున్న ఒక రిటైర్మెంట్ ప్లాన్. దీని కింద ఆర్గనైజ్డ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉద్యోగులు  రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం పొందడానికి వీలుంటుంది. ఈ స్కీమ్ కోసం యజమానినే మొత్తం అమౌంట్‌‌‌‌‌‌‌‌ను కంట్రిబ్యూట్ చేస్తాడు. అంటే  ఉద్యోగి జీతంలో 12 శాతం చొప్పున ఉద్యోగి, యజమాని ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌కి కంట్రిబ్యూట్ చేస్తారు.

ఉద్యోగి చేసే మొత్తం కంట్రిబ్యూషన్ పీఎఫ్‌‌‌‌‌‌‌‌కి వెళ్లగా, యజమాని చేసే కంట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌లో 8.33 శాతం ఈపీఎస్‌‌‌‌‌‌‌‌కు వెళుతుంది. మిగిలిన 3.67 శాతం పీఎఫ్‌‌‌‌‌‌‌‌కు వెళుతుంది. కనీసం 10 ఏళ్లు పనిచేసిన (వరుస ఏడాదిల్లో చేయాల్సిన అవసరం లేదు) వారు మాత్రమే అర్హులు. రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజ్  58 ఏళ్ల నుంచి ఉద్యోగి నెలకు ఈపీఎస్ కింద పెన్షన్ పొందొచ్చు. ఉద్యోగికి  తన రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజ్ నాటికి 10 ఏండ్లలోపు సర్వీస్‌‌‌‌‌‌‌‌ ఉంటే 10సీ ఫామ్‌‌‌‌‌‌‌‌ను ఫిల్ చేసి లంప్ సమ్‌‌‌‌‌‌‌‌ను పొందొచ్చు.