తెలంగాణకు మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్..త్వరలో ప్రారంభం

తెలంగాణకు మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్..త్వరలో ప్రారంభం

దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రారంభమవుతున్నాయి. ఇటీవలే తెలుగు రాష్ట్రాల మధ్య కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య తొలి రైలు పరుగులు పెట్టగా..ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ తిరుపతి మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే త్వరలో మూడో రైలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బెంగుళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ సర్వీస్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. 2023 జనవరిలోనే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు దీనిపై వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని కాచిగూడ మధ్యలో సెమీ హైస్పీడ్ ట్రైన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. వీరి వ్యాఖ్యలకు ఊతంమిస్తూ తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోడీ వందే భారత్ రైలుపై హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో మరో నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడి ఎన్నికల  ప్రచారంలో వందే భారత్ రైలు హామీపై బీజేపీ నేతలు ఇప్పటికే  ప్రచారం చేస్తున్నారు. 

బడ్జెట్లో భారీగా  కేటాయింపులు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్  స్లీపర్ వెర్షన్ కోసం ఇప్పటికే  రైల్వే బడ్జెట్ నుంచి రూ. 1800 కోట్ల కేటాయింపులు చేశారు. రాబోయే రెండేళ్లలో  దేశంలోని అనేక  మార్గాల్లో వందే భారత్ స్లీపర్ వెర్షన్కు చెందిన 400 రైళ్లను  ప్రారంభించనున్నారు. ఈ రైళ్లను తయారు చేసేందుకు ICFతోపాటు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. 400 రైళ్లలో  మొదటి 200 చైర్ కార్ రైళ్లు.. మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా తయారు చేయనున్నారు.  చైర్ కార్ రైళ్లు గరిష్టంగా 180 కిలో మీటర్ల వేగంతో  పరుగులు పెట్టేలా తయారు చేయనున్నారు. కానీ 130 కిలో మీటర్ల వేగంతో నడుపుతారని తెలుస్తోంది.