విదేశీయులకు వెల్‌కం.. నిషేధం ఎత్తివేత 

విదేశీయులకు వెల్‌కం.. నిషేధం ఎత్తివేత 

కరోనా కల్లోలం తగ్గుముఖం పడుతుండటంతో విదేశీ టూరిస్టులను దేశంలోకి అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్లలో వీరి రాకపోకలపై 18 నెలలుగా ఉన్న నిషేధాన్ని సోమవారం నుంచి ఎత్తివేసింది. అయితే, ‘వీరు వ్యాక్సిన్ డోసులన్నీ వేసుకుని ఉండాలి. కరోనా ప్రొటోకాల్​ పూర్తిగా పాటించాలి. 72 గంటల్లోపు తీసుకున్న కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరిలో పలువురు ఎయిర్ పోర్టులో దిగుతూనే కరోనా టెస్టు చేయించుకోవాల్సి కూడా ఉంటుందని చెప్పింది. వాక్సినేషన్​ సర్టిఫికెట్ల చెల్లుబాటు ఒప్పందాలున్న అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల ట్రావెలర్లకు మాత్రం ఎయిర్​పోర్టు టెస్టు వర్తించదని వివరించింది. నెల రోజులుగా రోజువారీ కరోనా కేసులు సగటున 10 వేలు మాత్రమే నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

5 లక్షల ఫ్రీ వీసాలు :
2020 మార్చిలో కరోనా కల్లోలం మొదలవగానే దాని కట్టడికి మోడీ సర్కారు అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. వాటిలో భాగంగా  ఫారిన్ టూరిస్టుల రాకపోకలపై ఈ 18 నెలల పాటూ నిషేధం అమల్లో ఉంది. అక్టోబర్ నుంచి వ్యాక్సినేటెడ్ టూరిస్టులను చార్టర్డ్ ఫ్లైట్లలో అనుమతిస్తున్నారు. టూరిస్టుల రాకను ప్రోత్సహించేందుకు వచ్చే నెలకల్లా 5 లక్షల ఫ్రీ వీసాలు జారీ చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కరోనా దెబ్బకు కుదేలైన టూరిజం, హోటళ్లు తదితర ఆతిథ్య రంగాలకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం. 2020లో మన దేశానికి వచ్చిన ఫారిన్ టూరిస్టుల సంఖ్య 30 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 
2019తో పోలిస్తే ఇది 75 శాతం తక్కువ!