కేసీఆర్​ అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందిస్తలే?

కేసీఆర్​ అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందిస్తలే?
  •  అరెస్ట్​ చేస్తమని చెప్పిన మోదీ, అమిత్​ షా మాటలు ఏమైనయ్?
  • బీజేపీ, బీఆర్​ఎస్​.. రెండు పార్టీలూ ఒక్కటే: మంత్రి పొన్నం
  • మేడిగడ్డకు బీఆర్​ఎస్​ లీడర్లు 
  • ఏం పీకనీకిపోయారో కేసీఆర్​ చెప్పాలని డిమాండ్​
  • నందిగామ నుంచి షాద్​నగర్​ వరకు ఆర్టీసీ బస్సులో జర్నీ

హైదరాబాద్/పాలమూరు/షాద్ నగర్, వెలుగు: పదేండ్లలో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్​, ఆయన కుటుంబంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రశ్నించారు. ‘‘ఈడీ, ఐటీల ద్వారా తమ రాజకీయ శత్రువులపై ముప్పేట దాడులు చేయిస్తున్న బీజేపీ.. మరి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఎందుకు వదిలేసిందో ప్రజలకు చెప్పాలి” అని డిమాండ్​ చేశారు. కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేసి జైల్లో పెడతామంటూ సాక్షాత్తు మోదీ, అమిత్ షానే చెప్పారని, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

 బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. అందుకే కేసీఆర్​ అక్రమాలపై చర్యలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నదని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్​కు కాన్వాయ్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​ వెళ్తూ మధ్యలో నందిగామ దగ్గర నారాయణపేట బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణిస్తున్నవాళ్లతో కొద్దిసేపు ముచ్చటించారు. మంత్రి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం, అందుకు వస్తున్న స్పందనను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

 ప్రయాణికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మహాలక్ష్మి పథకంతో సంతోషంగా ఉన్నామని మహిళా ప్రయాణికులు చెప్పగా.. బస్సులు సరిపడా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్తున్నామని ఇంకొందరు అన్నారు. త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వస్తున్నాయని, ఎవరికీ ఇబ్బందులు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కండక్టర్ కూడా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేందుకు చర్చిస్తున్నామని, సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం తెలిపారు. నందిగామ నుంచి షాద్​నగర్​వరకు బస్సులో ఆయన ప్రయాణించారు. అనంతరం షాద్ నగర్​లో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్​, మధుసూదన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్​ రూ.లక్ష కోట్లు ఖతం చేసిండు

మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ పార్టీ చూడడానికి వెళ్తే బొందలగడ్డను చూసి ఏం పీకుతారని చెప్పిన కేసీఆర్ మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏం పీకడానికి వెళ్లారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. ‘‘మేడిగడ్డను మానస పుత్రిక అంటూ సంబోధించి ఆ తర్వాత బొందలగడ్డగా మార్చిన కేసీఆర్ ఈ మధ్యలో లక్ష కోట్లు ఖతం చేసిండు. గత పదేండ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి? బాత్రూంలు కట్టామా.. బియ్యం పంచామా.. ఈజీఎస్ పనులు చేపట్టామా.. అంటూ సొల్లు చెప్పడం కాదు. ప్రజలకు అవసరమైన వైద్య ఆరోగ్యం, నిరుద్యోగం తదితర సమస్యలపై ఏనాడైనా స్పందించారా.. చెప్పండి?” అని నిలదీశారు.

 రాష్ట్ర ఖజానాను గత బీఆర్​ఎస్​ పాలకులు ఎట్ల ఖాళీ చేశారో, ప్రజా సొమ్మును ఎట్ల దోచుకుతిన్నారో.. అసెంబ్లీలో తాము శ్వేతపత్రాలు విడుదల చేస్తే, దీనికి పోటీగా బీఆర్ఎస్ లీడర్లు స్వేద పత్రాలు అంటూ ముందుకు తెచ్చారని, రాష్ట్రాన్ని చెమటతో నిర్మించినట్లు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘2014 ముందు మీరు ఎక్కడ ఉండేవాళ్లు? 2024లో ఎక్కడ ఉన్నారు? మీ ఆస్తులు, మీ బంగాళాలు, మీ ఫామ్ హౌస్​లు వీటినన్నిటిని శ్వేత పత్రం ద్వారా ప్రకటించండి?” అని బీఆర్​ఎస్​ లీడర్లను డిమాండ్ చేశారు.

 ‘‘ఎమ్మెల్యేలను తీసుకొని మా ప్రభుత్వం మేడిగడ్డను సందర్శించడానికి వెళ్తే నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్.. ఏం పీకడానికి వెళ్లారు? అంటూ నోరు పారేసుకున్నడు. మరి, బీఆర్​ఎస్​ నేతలు అక్కడికి వెళ్లింది ఏం పీకడానికో  కేసీఆర్​ చెప్పాలి” అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు పూర్తయ్యాయని, ఆరు గ్యారంటీల్లో దాదాపు అన్ని పూర్తి చేయబోతున్నామని అన్నారు. ఎవరికైనా సాంకేతిక కారణాలవల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దక్కకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.