చిన్న సేవింగ్స్‌‌ స్కీమ్‌‌లపై వడ్డీ తగ్గట్లే! ఆర్డర్ విత్‌డ్రా చేసుకున్న కేంద్రం

చిన్న సేవింగ్స్‌‌ స్కీమ్‌‌లపై వడ్డీ తగ్గట్లే! ఆర్డర్ విత్‌డ్రా చేసుకున్న కేంద్రం
  • చిన్న సేవింగ్స్‌‌ స్కీమ్‌‌లపై వడ్డీ తగ్గట్లే!
  • తగ్గించి ఇచ్చిన ఆర్డర్లు విత్‌‌డ్రా చేసుకున్న ప్రభుత్వం
  • మార్చి క్వార్టర్‌‌‌‌ రేట్లే కొనసాగుతాయి..
  • చూసుకోకుండా ఇచ్చిన ఆర్డర్లను వెనక్కి తీసుకోవచ్చు: సీతారామన్‌‌

న్యూఢిల్లీ: చిన్న సేవింగ్స్ స్కీమ్స్‌‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఇచ్చిన ఆర్డర్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంతకుముందులాగానే రేట్లు కొనసాగుతాయని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రతి క్వార్టర్ చివర్లో చిన్న సేవింగ్స్‌‌పై ఇచ్చే వడ్డీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనిలో భాగంగానే నేషనల్ సేవింగ్స్‌‌ సర్టిఫికేట్స్‌‌(ఎన్‌‌ఎస్‌‌సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌‌(పీపీఎఫ్‌‌), కిసాన్‌‌ వికాస్‌‌ పత్ర(కేవీపీ), సుకన్య సమృద్ధి స్కీమ్ వంటి స్మాల్ సేవింగ్స్‌‌పై ఇచ్చే వడ్డీని తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం ఆర్డర్స్ ఇచ్చింది. కానీ, గురువారం ఈ ఆర్డర్స్‌‌ను వెనక్కి తీసుకుంది. ‘స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌‌పై 2020–21 చివరి క్వార్టర్‌‌‌‌లో కొనసాగిన వడ్డీ రేట్లే ప్రస్తుత క్వార్టర్‌‌‌‌లో కూడా కొనసాగుతాయి. ఓవర్‌‌‌‌సైట్‌‌(చూసుకోకుండా ఇచ్చిన) ఆర్డర్స్‌‌ను తిరిగి వెనక్కి తీసుకోవచ్చు’ అని సీతారామన్‌‌ ట్విటర్‌‌‌‌లో పేర్కొన్నారు.

పాత రేట్లే కొనసాగుతాయి..
ఆర్డర్లను వెనక్కి తీసుకోవడంతో పీపీఎఫ్‌‌పై ఏడాదికి 7.1 శాతం వడ్డీని, ఎస్‌‌ఎస్‌‌ఈపై 6.8 శాతం వడ్డీని ఇస్తారు. ముందు ఈ స్కీమ్‌‌లపై వడ్డీని 0.7 శాతం, 0‌‌‌‌.9 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డర్లిచ్చింది. ఏడాది కాల వ్యవధి ఉన్న టెర్మ్‌‌ డిపాజిట్లపై వడ్డీని 1.1 శాతం తగ్గించి 4.4 శాతానికి తెచ్చిన ప్రభుత్వం, తిరిగి  5.5 శాతం వడ్డీనే కొనసాగిస్తోంది.  సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీని ఇస్తారు. ముందు ఇది 6.9 శాతానికి తగ్గించారు. సీనియర్ సిటిజన్‌‌ స్కీమ్స్‌‌పై 7.4 శాతం వడ్డీని, సేవింగ్స్‌‌ డిపాజిట్లపై ఏడాదికి 4 శాతం వడ్డీని కొనసాగిస్తారు. రేట్లను తగ్గించడంతో ఈ వడ్డీ 3.5 శాతానికి తగ్గింది. ఐదేళ్ల కాల వ్యవధి ఉన్న టెర్మ్ డిపాజిట్లపై  5.5–6.7 శాతం వడ్డీని ఇస్తారు. ఈ వడ్డీని క్వార్టర్‌‌‌‌ ప్రాతిపదికన చెల్లిస్తారు. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీని ఇస్తారు. ముందు దీన్ని 5.3 శాతానికి తగ్గించారు.