ఏదో జరుగుతుంది : కేబినెట్ కార్యదర్శలు అందరూ ఢిల్లీలోనే ఉండాలి : కేంద్రం కీలక ఆదేశాలు

ఏదో జరుగుతుంది : కేబినెట్ కార్యదర్శలు అందరూ ఢిల్లీలోనే ఉండాలి : కేంద్రం కీలక ఆదేశాలు

ఢిల్లీలో ఏదో జరుగుతుంది.. పెద్ద పెద్ద నిర్ణయాలు చకచకా జరుగుతున్నాయి. 24 గంటల్లోనే అత్యంత కీలకమైన ఆదేశాలు వరసగా వస్తున్నాయి. రాఖీ పౌర్ణమి ఆగస్ట్ 31వ తేదీ సాయంత్రం.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అని ప్రకటించింది కేంద్రం. ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలు.. కీలక బిల్లులపై చర్చ అని ప్రకటించింది. ఊహించని ఈ పరిణామంతోనే అన్ని రాజకీయ పార్టీలు షాక్ అయ్యాయి. 

తెల్లారింది.. సెప్టెంబర్ ఒకటో తేదీ.. వన్ నేషన్ -వన్ ఎలక్షన్ తెరపైకి వచ్చింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో 18 మంది సభ్యులతో కమిటీ.. సెప్టెంబర్ 17వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం. దీనిపై ఢిల్లీతోపాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 

ఆ తర్వాత రోజు...ఆశ్చర్యకరంగా రామ్ నాథ్ కోవింద్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యాడు. జమిలి ఎన్నిక కమిటీ ప్రకటించిన తెల్లారే..ఈ భేటీ జరగడం చర్చను మరో లెవల్ కు తీసుకెళ్లింది. 

ఈ పరిణామాల క్రమంలోనే.. మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు అందరూ ఢిల్లీలోనే ఉండాలని.. రాష్ట్రాల పర్యటనలు రద్దు చేసుకోవాలని.. మిగతా అన్ని పనులు రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించింది కేంద్రం. ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి లేకుండా ఏ శాఖ కార్యదర్శి  ఢిల్లీ వదిలి వెళ్లరాదంటూ హుకూం జారీ చేసింది.  ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురానున్న నేపథ్యంలో అధికారులపై ఈ  ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది.  

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మోదీ సర్కారు రద్దు అవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణల బిల్లును ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. అయితే  జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో  వెల్లడించారు. అయితే  ఆ సవరణల కోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు  ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సమావేశాల్లో  రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించి..జమిలి  బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   ఈ ప్రత్యేక సమావేశాల్లో మొత్తం 10 కి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.