అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టండి..!

అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టండి..!
  • రాష్ట్రాలకు కేంద్రం సూచన
  • కొన్ని జిల్లాల్లో కేసులు పెరగడంపై ఆందోళన 
  • ఆంక్షలు విధించాలని, టెస్టులు పెంచాలని ఆదేశం 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ ను దృష్టిలో పెట్టుకొని వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించింది. జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, కేసులు పెరిగితే వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శనివారం లెటర్ రాశారు. ‘‘గత రెండు వారాల్లో కేరళ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మణిపూర్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్ లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5% నుంచి 10% మధ్య నమోదైంది. మిజోరం, కేరళ, సిక్కింలోని 8 జిల్లాల్లో 10 శాతానికి పైగా రికార్డయింది. ఈ 27 జిల్లాలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్​ చేయాలె” అని లెటర్ లో పేర్కొన్నారు. జిల్లాల్లో కేసులు పెరుగుతున్నందున వాటిపై నిఘా పెంచాలన్నారు. ఏదైనా జిల్లాలో కేసులు, పాజిటివిటీ రేటు పెరిగితే... వెంటనే కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. కంటైన్ మెంట్ జోన్లు, క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 

పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువుంటే..
పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువ ఉన్న జిల్లాల్లో అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ‘‘ ఏ జిల్లాలోనైనా పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువున్నా, జిల్లాలోని ఐసీయూ బెడ్లలో 60% నిండినా.. ఆ జిల్లాలో నైట్ కర్ఫ్యూ విధించాలి. ఆయా ప్రాంతాల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవడం.. సభలు, సమావేశాలపై నిషేధం.. లగ్గాలు, అంత్యక్రియలకు జనం హాజరుపై పరిమితులు విధించడం తదితర చర్యలు తీసుకోవాలి” అని రాజేశ్ భూషణ్ సూచించారు. అన్ని చోట్లా కరోనా ఆంక్షలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎవరైనా రూల్స్ పాటించకపోతే ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఆంక్షలు పెట్టాలని, వాటిపై ముందస్తుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పరిస్థితిపై ఎప్పుటికప్పుడు రివ్యూ చేయాలని చెప్పారు.

కొత్తగా 7,992 కరోనా కేసులు
93 వేలకు తగ్గిన యాక్టివ్‌‌ కేసులు 

దేశంలో కొత్తగా 7,992 మంది కరోనా బారిన పడినట్లు, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు పైగా పెరిగినట్లు హెల్త్‌‌ మినిస్ట్రీ శనివారం వెల్లడించింది. వైరస్‌‌తో మరో 393 మంది చనిపోగా, మరణాల సంఖ్య 4,75,128కి పెరిగినట్లు తెలిపింది. 559 రోజుల తర్వాత యాక్టివ్‌‌ కేసులు 93,277కు తగ్గినట్లు, ఇది టోటల్‌‌ ఇన్‌‌ఫెక్షన్‌‌ రేటులో 0.27 శాతం అని చెప్పింది. రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగిందని తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 0.64 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.71 శాతం, డెత్‌‌ రేటు 1.37 శాతంగా ఉందని పేర్కొంది. వైరస్‌‌ నుంచి ఇప్పటివరకు 3,41,14,331 మంది కోలుకున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా 131.99 కోట్లకు పైగా వ్యాక్సిన్‌‌ డోసులు వేసినట్లు వెల్లడించింది.