కార్పొరేటర్​ నుంచి కేంద్ర మంత్రి దాకా .. బండి సంజయ్​ రాజకీయ ప్రస్ధానం

కార్పొరేటర్​ నుంచి కేంద్ర మంత్రి దాకా  .. బండి సంజయ్​ రాజకీయ ప్రస్ధానం
  • బండి సంజయ్​ రాజకీయ జీవితంలో అన్నీ ఒడిదొడుకులే
  • అసెంబ్లీలో ఓడినా ఎంపీగా గెలవడంతో కలిసొచ్చిన అదృష్టం
  • 20 ఏండ్ల తర్వాత కరీంనగర్ కు దక్కిన సెంట్రల్ మినిస్టర్​ పోస్ట్​

కరీంనగర్, వెలుగు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి వరించింది. కరీంనగర్ ఎంపీగా రెండోసారి ఎన్నికైన ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోబోయే ఎంపీల జాబితాలో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌‌‌‌రెడ్డి తో పాటు మరికొందరి పేర్లు బలంగా వినిపించినప్పటికీ చివరికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైపే హైకమాండ్​ మొగ్గు చూపింది.

సంజయ్ కి కేబినెట్ లో చోటు దక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంటి వద్ద, కరీంనగర్ లోక్ సభ పరిధిలో కార్యకర్తలు ఆదివారం సంబురాలు చేసుకున్నారు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా, రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన బండి సంజయ్ తన రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే చివరికి కేంద్ర మంత్రిగా ఎదిగారు. 

శిశుమందిర్​లో చదువు

బండి సంజయ్.. కరీంనగర్ లో మధ్య తరగతి కుటుంబానికి చెందిన నర్సయ్య, శకుంతల దంపతులకు 1971 జులై 11న జన్మించారు. తండ్రి ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేశారు. సంజయ్ స్కూల్ చదువు కరీంనగర్ లోని సరస్వతి శిశుమందిర్ లో సాగింది. 12 ఏండ్ల వయస్సులోనే ఆర్ఎస్ ఎస్ లో చేరి ప్రాథమిక స్థాయిలో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా పని చేశారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీ కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇన్​చార్జిగా కూడా సంజయ్ పనిచేశారు. ఆ తర్వాత బీజేవైఎంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994-–2003 వరకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు. 1996లో కేంద్ర మాజీ మంత్రి ఎల్ కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో 35 రోజుల పాటు పాల్గొన్నారు. 

కార్పొరేటర్ నుంచి ప్రజాజీవితం మొదలు 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయ్యాక (2005లో) జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా బండి సంజయ్ ఎన్నికయ్యారు. 2005 నుంచి 2019 వరకు ఆయన కార్పొరేటర్ గా కొనసాగారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒకానొక సమయంలో 2018లో అప్పటి రాష్ట్ర నాయకత్వం తీరు నచ్చక.. తనకు ఏ పదవులు వద్దని కార్యకర్తగా  కాషాయ జెండా కింద హిందూ ధర్మం కోసం పని చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించాక.. ఆయన రాజకీయ జీవితం ఊహించని మలుపు తిరిగింది. 2020 మార్చి 11న ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రధాన శక్తిగా ఎదిగింది. ప్రజా సంగ్రామ యాత్రల ద్వారా తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల సమస్యలపై ఆనేక ఆందోళనలు చేసి, జైలు పాలయ్యారు. ఆ తర్వాత ఆయనను  అధ్యక్షుడిగా తొలగించడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేడర్​లో ఒకింత నిరుత్సాహం ఆవహించింది. అయినా 2023 నుంచి పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి హోదాలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా తిరిగారు. తాజాగా నిర్వహించిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఘన విజయం సాధించి, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

20 ఏండ్ల తర్వాత కరీంనగర్ కు కేంద్ర మంత్రి పదవి  

కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి 1999 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అప్పటి ప్రధాని వాజ్ పేయి కేబినెట్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004లో కరీంనగర్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన కేసీఆర్.. కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా కొన్నాళ్లు పని చేశారు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం రాలేదు. 20 ఏండ్ల తర్వాత కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కేంద్ర కేబినేట్ లో చోటు దక్కించుకున్నారు.