జీఎస్టీ రిటర్నుల్లో తేడాలు..33 వేల నోటీసుల జారీ

జీఎస్టీ రిటర్నుల్లో తేడాలు..33 వేల నోటీసుల జారీ

న్యూఢిల్లీ :  2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో దాఖలు చేసిన జీఎస్టీ రిటర్న్‌‌‌‌లలో తేడాలు కనిపించడంతో  సెంట్రల్ ట్యాక్స్ అధికారులు వ్యాపార సంస్థలకు దాదాపు 33 వేల జీఎస్టీ నోటీసులను పంపారని సీబీఐసీ తెలిపింది.   రెవెన్యూ సెక్రటరీ అధ్యక్షతన రాష్ట్ర  కేంద్ర జీఎస్టీ అధికారుల జాతీయ సమన్వయ కమిటీ భేటీ ఈ నెలాఖరు లేదా జనవరి ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది.  నోటీసుల జారీకి సంబంధించి పన్ను అధికారులకు ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తారు. 

జీఎస్టీపై అసోచామ్ నేషనల్ కాన్ఫరెన్స్‌‌‌‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్​డైరెక్ట్​ ట్యాక్సెస్​(సీబీఐసీ) సభ్యుడు- శశాంక్ ప్రియ మాట్లాడుతూ, 2017–-18,  2018-–19 కోసం పంపిన నోటీసులు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని అన్నారు. రెండేళ్లపాటు వార్షిక రిటర్నులు దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన గడువును పొడిగించడం వల్ల కూడా డిమాండ్ నోటీసులు పెరిగాయని ఆయన చెప్పారు.  జీఎస్టీ జూలై 1, 2017న అమలులోకి వచ్చింది. 2017–-18 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రిటర్న్‌‌‌‌లను దాఖలు చేయడానికి చివరి తేదీని ఫిబ్రవరి 7, 2020 వరకు పొడిగించగా, 2018-–19కి ఇది డిసెంబర్ 2020 వరకు ఉంది. 

జీఎస్టీ చట్టం ప్రకారం, ప్రతి రిజిస్టర్డ్ వ్యక్తి వచ్చే ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31 వరకు లేదా అంతకు ముందు ప్రతి ఆర్థిక సంవత్సరానికి వార్షిక రిటర్న్‌‌‌‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. దీని ప్రకారం, 2022–-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రిటర్న్‌‌‌‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2023. జీఎస్టీ రిజిస్టర్డ్​ వ్యాపార సంస్థలు పన్నులు తక్కువ కట్టినందుకు కూడా నోటీసులు పంపామని ఆయన చెప్పారు. 2023 మే 16 నుంచి జూలై 15 వరకు రెండు నెలలపాటు సాగిన స్పెషల్ డ్రైవ్‌‌‌‌లో 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌‌‌‌లు,  రూ. 24 వేల  కోట్లకు పైగా పన్ను ఎగవేతలను కేంద్ర  రాష్ట్ర జీఎస్టీ అధికారులు గుర్తించారని పేర్కొన్నారు.