మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. మరో ఇద్దరికి కూడా

మాజీ  ప్రధాని పీవీకి భారత రత్న.. మరో ఇద్దరికి కూడా

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం పీవీతోపాటు మరో ఇద్దరికి భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది.ఇందులో మాజీ ప్రధానమంత్రి చౌదరి  చరణ్ సింగ్, వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లు ఉన్నారు. భారతరత్న అవార్డు వరించిన తొలి తెలుగు వ్యక్తికిగా పీవీ నరసింహరావు నిలిచారు. 

ఈ సారి మొత్తం ఐదుగురు.. పీవీ నరసింహారావు, చౌదరి  చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్, ఎల్ కె అద్వానీలకు భారతరత్న అవార్డు ప్రకటించింది కేంద్రం. ఒక ఏడాదికి ఐదుగురికి భారతరత్న అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి.

Also Read : మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా : సీతక్క సూటి ప్రశ్న

పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1991 నుంచి 1996 వరకు భారత దేశ ప్రధానమంత్రిగా చేసిన తొలి తెలుగు.. తెలంగాణ వ్యక్తి. 1921, జూన్ 28వ తేదీన జన్మించిన పీవీ నరసింహారావు.. రాజనీతిలో ఆరితేరారు. గొప్ప విజనరీగా గుర్తింపు పొందారు. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు.. భారతదేశ ఆర్థిక, వ్యాపార స్వరూపాన్ని మార్చేశారు. సరళమైన ప్రపంచీకరణ వైపు భారతదేశాన్ని తీసుకెళ్లిన మహానుభావుడు పీవీ నరసింహారావు. ఇతర దేశాల్లో వాణిజ్య, వ్యాపారాలను విస్తృతం చేసి.. భారత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ వైపు తిప్పిన మేధావి పీవీ నరసింహారావు.